చాలామంది రిటైర్ అయ్యాక విశ్రాంతిని కోరుకుంటారు. కానీ, రిటైర్డ్ లైఫ్‌ను సమాజానికి అంకితం చేశారు ఈ దంపతులు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న గ్రామీణ యువత కోసం తమ నివాసాన్నే గ్రంథాలయంగా మార్చారు. నిరుద్యోగులకు బతుకుబాట చూపుతున్నారు. వారే ఖమ్మం పట్టణానికి చెందిన చావా దుర్గాభవాని, పారుపల్లి అజయ్‌కుమార్ దంపతులు. రూ.20 లక్షలు వెచ్చించి గ్రంథాలయం ఏర్పాటు చేసి, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉద్యోగార్థులకు చుక్కానిగా నిలుస్తున్న ఈ దంపతులను జిందగీ పలకరించింది. ఆ విశేషాలే ఇవి..
తమ తండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో వాళ్ల ప్రభావం ఈ ఇద్దరిపై పడింది. ఆ స్ఫూర్తితోనే టీచరు కొలువులు సాధించారు. అందుకే వారి జ్ఞాపకార్థంగా వారి పేర్లను తమ గ్రంథాలయానికి పెట్టుకున్నారు. పెద్ద రీడింగ్ హాల్‌కు అజయ్ కుమార్ తండ్రి పేరుతో ‘పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట’ అని, మినీ రీడింగ్ హాల్‌కు దుర్గా భవాని తండ్రి పేరైన ‘చావా రామారావు’ అని పేరు పెట్టి విజ్ఞానాన్ని అందిస్తున్నారు. పోటీపరీక్షలతోపాటు సాహితీ ప్రియులకోసం వివిధ భాషలకు చెందిన గ్రంథాలను ఇక్కడ పొందుపరిచారు.
‘ఇద్దరం గొప్పగా చదువుకున్నాం. మంచి ఉదోగ్యాల్లో స్థిరపడ్డాం! ఇక సమాజంతో మనకేంటి పని’ అని ఏనాడూ అనుకోలేదు ఆ దంపతులు. ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి.. సమాజ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషించారు అజయ్, దుర్గాభవాని. పదవీ విరమణ తర్వాత కూడా అదే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన చావా దుర్గా భవానికి చదువంటే ఇష్టం. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో కూతురును చక్కగా ప్రోత్సహించాడు. అలా కష్టపడి 1997లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కొలువు సాధించింది. అదే జిల్లాకు చెందిన పారుపల్లి అజయ్‌కుమార్ కూడా చదువులో మొదట్నుంచీ చురుకే! ఇంటర్ కాగానే టీటీసీ పూర్తిచేశారు. 1986లో ఎస్జీటీ టీచర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అజయ్, దుర్గ బంధువులు కావడంతో ఇద్దరికీ పెద్దలు పెండ్లి నిశ్చయం చేశారు. అజయ్ ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదివి జూనియర్ కాలేజీ అధ్యాపకుడిగా పదోన్నతి పొందారు. అధ్యాపకుడిగా రిటైర్ అయ్యారు.
తండ్రి ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నా.. దుర్గాభవాని బాల్యంలో ఆటుపోట్లకు కొదువ లేదు. ‘బతకలేక బడిపంతులు’ అనే ఆ రోజుల్లో.. వాళ్ల కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తరచూ సవాళ్లు విసిరేవి. కొత్త పుస్తకాలు కొనాలన్నా జేబులు తడుముకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొని చదువు వెళ్లదీసింది దుర్గాభవాని. మరోవైపు చిన్నప్పుడు అజయ్ కుమార్ పరిస్థితీ దాదాపు ఇంతే! ఇద్దరూ కష్టాలు చూసి పెరిగిన వాళ్లు కావడంతో, వృత్తిలో స్థిరపడిన తర్వాత కష్టాల్లో ఉన్న ఇతరులను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించారు. ఉప్పు, పప్పు దానం చేసి గొప్పకు పోలేదు వాళ్లు. విద్యార్థులకు అండగా నిలిచారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు, ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు అండగా నిలవాలని భావించారు.

కుటుంబ బాధ్యతలు ఎన్ని ఉన్నా.. ఉన్నంతలో నలుగురికి సాయం చేస్తూ వచ్చారు. రిటైర్ అయ్యాక కూడా పనిచేస్తూనే ఉండాలనే ఆలోచన అజయ్‌ది. తాను రిటైర్ అవ్వగానే భార్యతో ‘ఇకనుంచి ఈ సామాజానికి మరింత సేవ చేయాలనుంది’ అని తన మనసులో మాట చెప్పారు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. ఇద్దరూ ఒక్కటిగా ఆలోచించి.. తమలాగా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలనే వారికి చేయుతనివ్వాలని నిర్ణయానికి వచ్చారు. పదిమందికి డబ్బులివ్వడంతోనో, నాలుగు పుస్తకాలు కొనివ్వడంతోనో తమ బాధ్యత పూర్తవుతుందని అనుకోలేదు. తమ ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. ఉద్యోగార్థులు, విద్యార్థులు తమ ఇంటికి వచ్చి కావాల్సినవి చదువుకునేలా ఏర్పాటు చేశారు. అలా వికసించిన విద్యావనమే ‘పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట’. తమ ఇంట్లోని మొదటి అంతస్తు మొత్తాన్ని గ్రంథాలయంగా మార్చేశారు. రూ.20 లక్షలు వెచ్చించి.. మౌలిక వసతులు కల్పించడంతోపాటు పుస్తకాలు సమకూర్చారు. అలా 2019లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. లైబ్రరీ నిర్వహణ, కొత్త పుస్తకాలు తీసుకురావడం ఇవన్నీ అజయ్‌కుమార్ పనులు. యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు తెలియపరచడం, సిలబస్ వివరించడం దుర్గాభవాని కర్తవ్యం. ఇలా ఇద్దరూ కలిసి తమ ఇంటిలో 8000కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచి.. నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్నారు.
ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల నుంచి పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ గ్రంథాలయం ఓ దేవాలయంతో సమానం. వేలకు వేలు కట్టి కోచింగ్ తీసుకోలేని వారికి ఉచితంగా పుస్తకాలిచ్చి ఉద్యోగం వచ్చేవరకు చదివిస్తున్నారు వీళ్లు. దూరప్రాంతాలకు చెందినవాళ్లు సైతం టౌన్లోనే రూమ్ అద్దెకు తీసుకొని నిత్యం ఈ గ్రంథాలయానికి వచ్చి తమ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ చదువుకున్నవాళ్లలో 15 మంది పోలీసు ఉద్యోగాలు, 25 మంది టీచర్ కొలువులు సాధించడంతోపాటు పలువురు నేవీ, ఆర్మీ, రైల్వే లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రంథాలయ నిర్వహణకు గానూ ప్రతి నెలా రూ.25 వేలకుపైగా సొంత నిధులు ఖర్చుచేస్తున్నారు అజయ్, దుర్గాభవాని దంపతులు.

ప్రతిపనిలో కూడా జవాబుదారీగా ఉండాలనే ఆలోచనతో వాళ్ల సన్నిహితులతో కమిటీ ఒకటి వేసుకున్నారు. ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్లు ఎంతో కొంత డొనేషన్ రూపంలో పంపుతుంటారు. ఆ డబ్బుతో పుస్తకాలు కొంటుంటారు. ప్రస్తుతం దుర్గాభవాని ఖమ్మం పట్టణంలోనే ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. లైబ్రరీ నిర్వహణలో ఇద్దరూ తలమునకలుగా ఉంటారు. భవిష్యత్తులో గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి పరచాలని భావిస్తున్నారు. ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఉద్యోగార్థులకు ఉచిత తరగతులు నిర్వహించాలనే తలంపుతో ఉన్నారు. సర్కారు కొలువు సాధించడానికి గ్రామీణ విద్యార్థులకు తోడ్పాటు అందివ్వడమే తమ లక్ష్యం అని చెబుతున్న అజయ్, దుర్గాభవాని దంపతులకు మనమూ హ్యాట్సాఫ్ చెబుదాం!
– రాజు పిల్లనగోయిన
బండారి మహేశ్