ఒకప్పుడు బాధలు చెప్పుకునేందుకు కూడా ఎవ్వరూ లేని దిక్కులేని పరిస్థితి నుంచి నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఎదిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు, ప్రజల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించే పార్టీ టీఆర్ఎస్ అని, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన స్పష్టంచేశారు. దేశమంతా కారు చీకట్లలో ఉంటే తెలంగాణలో మాత్రం వెలుగులు నిండుకున్నాయని, మన పరిపాలనా దక్షతకు ఇదే మచ్చుతునకని చెప్పారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం..ఆయన మాటల్లోనే…
రెండు దశాబ్ధాల కఠోర పరిశ్రమ 21వ సంవత్సరం పూర్తిచేసుకొని 22వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భం. నిబద్ధమైన, సువ్యవస్థితమై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 80శాతంమంది ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది పార్టీ సభ్యులతో, సుమారు రూ. 1000 కోట్ల ఆస్తులు కలిగివున్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి, రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న సమర సైనికుల, కాపలాదారుల పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ తెలంగాణకు పెట్టనికోట. ఎవ్వరూ బద్దలు కొట్టలేని కంచుకోట. ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి. ఏ వ్యక్తిదో, శక్తిదో కాదు, యావన్మంది తెలంగాణ ప్రజల ఆస్తి.
నిండైన, మెండైన శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ. రెండు దశాబ్ధాల క్రితం ఏడుపొస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడవాలనో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానిది. దుఃఖం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. రాష్ట్ర అస్థిత్వమే ఆగమైపోయే పరిస్థితి. రాష్ట్రానికి ఒక సంస్థలేదు, ఒక పార్టీ లేదు, ఒక నాయకత్వం లేదు. ఆ సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లోనుంచి ఎగిసిపడ్డ ఈ గులాబీ పతాకం. అనేక ఒడిదుడుకులు, అనేక అవమానాలు, ఛీత్కారాలు, ధూత్కారాలు, విజయాలు, అపజయాలు, అన్నింటి సమాహారంగా రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికి తెలుసు.
రాష్ట్ర సాధన తరువాత కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియలో, ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీర్వాదబలంతో అద్భుతమైన పరిపాలనను అందిస్తూ, దేశానికో ఒక రోల్ మోడల్‌గా తెలంగాణ పరిపాలన కొనసాగుతున్న విషయం మనందరికి తెలుసు. మనకి మనం డబ్బాకొట్టుకొని, మనల్నిమనం పొగుడుకునే అవసరం మనకి లేదు. కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే ఇందుకు తార్కాణం. నిన్న కేంద్రం చేసిన ప్రకటన… దేశంలో అతి ఉత్తమమైన గ్రామాల్లో ఒకటి నుంచి పది వరకు పదికి పది తెలంగాణ గ్రామాలే. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. మరో 20 గ్రామాలు తీసుకొని మళ్లీ పరిశీలన చేస్తే అందులో కూడా 19గ్రామాలు తెలంగాణవే ఉన్నాయి. మనం పనిచేస్తున్న తీరుకు ఇది మచ్చుతునక.
అవినీతికి తావులేని పారదర్శక ప్రభుత్వం :
నేను, మంత్రి హరీష్‌రావు ప్రజలకోసం నాలుగు ఆసుపత్రులకు శంకుస్తాపనకు వెళ్తే మన రాష్ట్రంలో అవార్డులు రాని డిపార్టుమెంటు లేదని అక్కడ చర్చ సందర్భంగా అంటున్నారు. నిబద్ధమైన పద్ధతుల్లో, పూర్తి అవినీతి రహితంగా లక్ష్యశుద్ధితో, పట్టుదలతో, చిత్తశుద్ధితో కార్యాచరణ కావిస్తున్నాం కాబట్టే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు కరువు కాటకాలకు ఆలవాలమైన తెలంగాణ నేడు జలభాండాగారంగా రూపుదిద్దుకున్నది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని అంతర్జాతీయ ఛానళ్లు చెబుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే అద్భుతమైన తెలంగాణ త్వరలోనే సాకామవుతుందని మనవి చేస్తున్న. విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న సందర్భంలో వెలుగు జిలుగుల తెలంగాణను మనం ఏర్పాటుచేసుకున్నాం. ఇది కూడా మన పరిపాలనా దక్షత, అంకితభావానికి ఉదాహరణ.
తాగునీరు, సాగునీరు, విద్యుత్, సంక్షేమం ఇలా ఏ రంగంలో తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు, గొప్ప ఉదాహరణలు, దేశానికే ఆదర్శప్రాయమైన విషయాలు ఉన్నాయి. జరిగిన కృషి, మేధోమథనం, ఎందరో గొప్పవారు, పార్టీకి అంకితమై పనిచేసే కార్యకర్తల సమాహారమే ఈ ఫలితం. మనం అందరం రాజకీయాల్లో చూస్తా ఉంటాం. నేను కూడా 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోతే వికెట్ నెంబర్-1 పోయిందని పేపర్లలో రాస్తారు. అలాంటి పోయే వికెట్లు తెలంగాణ మంత్రివర్గంలో లేవు. కర్నాటకలో ఒక మంత్రి ఈ మధ్యనే అవినీతికి పాల్పడి పదవి కోల్పోయిన విషయం చూశాం. అటువంటి పరిస్థితులు తెలంగాణలో లేవు.
అడ్డదిడ్డమైన పనులకు తావులేకుండా ఏ పనైనా ప్రజలు కేంద్రబిందువుగా, ప్రజలే ఇతివృత్తంగా, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, లక్ష్యంగా పనిచేస్తున్నాం. ధరణి పోర్టల్ ఈనాడు దేశమే ఆశ్చర్యపోయే విధంగా రూపొందించుకున్నాం. న్యాయకోవిదులు కూడా ఆశ్చర్యపోతావున్నారు. ఎంత పారదర్శకంగా, అవినీతి లేకుండా జనాల్లో భూముల మార్పిడి జరుగుతున్నదో, ఒక్కసారి ధరణి పోర్టల్‌లో చేరితే గుండెలపై చేయివేసుకొని ప్రశాంతంగా బతికే పరిస్థితి వచ్చిందో..అది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి. ఏ నిర్ణయం చేసినా అది ఇతరులకు ఆదర్శంగా, ఉద్భుతమైన ఫలితాలు సాధించి గొప్పగా ముందుకు పోతావున్నాం. ఇంకా సాధించాల్సింది ఉంది. అయినప్పటికీ జరిగిన పని, చేసిన కృషి పునఃశ్చరణ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి చెబుతున్నా.
అన్నింటా మనమే నెంబర్-1..
ఆ రోజు చాలా సందర్భాలు, చాలా జ్ఞాపకాలు ప్రొఫెసర్ జయశంకర్, సీహెచ్ విద్యాసాగర్‌రావు ఢిల్లీలో ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపిన సందర్భాలు. తెలంగాణ వస్తే ఏమి చేయాలి, ఎక్కడి నుంచి మన ప్రయాణం మొదలుపెట్టాలి, ఏ విధమైన అవరోధాలున్నాయి, ఏమి అవకాశాలున్నాయి అని అనేకమైన మేధోమథనం ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసుకున్నాం. తత్ఫలితంగా ఎంతో ముందుగానే లబ్ధప్రతిష్టులుగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, గుజరాత్ రాష్ర్టాలను అధిగమించి తలసరి ఆదాయంలో మన ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాం. నేడు తెలంగాణ రెండు లక్షల 78 వేల తలసరి ఆదాయం గల రాష్ట్రంగా అవతరించింది. ఇప్పుడు చెప్పిన రాష్ట్రాలన్నింటికంటే ఎక్కువ తలసరి ఆదాయం తెలంగాణది.
విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్-1. ఇంటింటికి మంచినీరు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్-1. జీరో ఫ్లోరైడ్ రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్-1. ఇలా అనేక విధానాల్లో పురోగమిస్తున్నాం. వ్యవసాయరంగంలో సాధించిన విప్లవాలు, మనం పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనలేని అశక్తతను వెలిబుచ్చే స్థాయికి చేరామంటే ఏ స్థాయికి తెలంగాణ వ్యవసాయరంగం విస్తరించిందో, పచ్చదనంతో అలరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. జీఎస్డీపీ.. రాష్ట్ర స్థూల ఆదాయం దేశంకంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంది. 2014లో రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం సుమారు ఐదు లక్షల కోట్లుగా ఉండేది. నేడు మన ఆదాయం రూ.11 లక్షల 50 వేల కోట్లతో దేశంలో అద్భుతమైన గ్రోత్తో ముందుకుపోతున్నాం. ఒక్కప్పుడు రాష్ట్రంలో మూడే మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. నేడు 33 ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకుంటున్నాం. రెండున్నర లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ అని మనవిచేస్తున్నా. ఈ రోజే గ్రూప్-1..503 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. యువత అంతా పరీక్షలకోసం తలమునకలవుతున్నారు. ఏ రంగం తీసుకున్నా మనం పురోగమిస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
కేంద్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే ఇంకా పురోగతి సాధించేవాళ్లం..
మనం దేశంలో ఒక రాష్ట్రంగా, ఒక భాగంగా ఉన్నాం. దేశం కూడా మన స్థాయిలో పనిచేసి ఉంటే మన జీఎస్డీపీ రూ.11.5 లక్షల కోట్లు కాదు, 14.5 లక్షల కోట్లుగా ఉండేది. కనీసం మన స్థాయిలో అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేసివుంటే మన జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లు ఉండేది. ఇది నేను చెబుతున్నది కాదు, ‘కాగ్’ చెబుతున్న, ఆర్థిక నిపుణులు చెబుతున్న లెక్క. అర్థశాస్త్ర పండితులు చెబుతున్న లెక్క. మనం చేస్తున్న స్థాయిలో కేంద్రం పనిచేయడంలేదు అని చెప్పడానికి ఇది ప్రబల తార్కాణం. ప్లీనరీలో అనేక విషయాలు, తీర్మానాలు వస్తున్నాయి. మిత్రులు టంకశాల అశోక్ వ్యాసం రాశారు, కేశవరావు కూడా వారి ప్రసంగంలో ప్రస్తావించారు. మరో మిత్రుడు శ్రీశైల్ రెడ్డి కూడా వ్యాసం రాశారు. అందులో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు.. పత్రికలు కూడా రాస్తా ఉన్నాయి.
కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తారని పేపర్లు రాస్తా ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఏమి జరిగిందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్ర ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో ప్రజలకు లభించలేదు. ప్రజాస్వామ్య పరిపక్వత జరిగి అధికార బదలాయింపు జరగాలో ఆ పద్ధతిలో జరగలేదు. పెడధోరణులు మరింత ప్రబలిపోతున్నాయి తప్ప మంచి మార్గం కానరావడంలేదు. ఇటీవలి కాలంలో దేశంలో విపరీతమైన కొన్ని జాడ్యాలు, అవాంఛిత, అవసరం లేని పెడ ధోరణులు ప్రబలుతా వున్నాయి. భారత సమాజానికి ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. సహనానికి ఆలవాలమైన సమాజం, అందరినీ ఆదరించే సమాజం మనది. అద్భుతమైన ఈ దేశంలో కొన్ని సంకుచిత, ఇరుకైన విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి పోతున్నాయి. ఈ సందర్భంలో రాజకీయపార్టీగా, రాష్ట్రంగా మన పాత్ర ఏ విధంగా ఉండాలనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అంతేకాదు, తీసుకున్న నిర్ణయాలను అమలుచేసి అభ్యున్నతికోసం శక్తివంచనలేకుండా కృషిచేయాల్సి ఉంటుంది.
విద్యుత్ కోతలు.. ఎందుకీ దౌర్భాగ్యం..
తీసుకున్న నిర్ణయాలను అమలు చేసి ఈ దేశ అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. దేశంలో జరుగున్న కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు. కారణం ఈ రాజకీయాల్లో మనకు నేర్పించింది అంతే. మనకు చెప్పబడింది కూడా అంతే. ఇందులో మన తప్పు లేదు. మనకు తెలిసింది అంతే కాబట్టి.. దాని చుట్టే మన ఆలోచనలు ఉన్నాయి. చదువుకున్న వాళ్లకు కూడా చాలా విషయాలు దూరంగానే ఉంచబడ్డాయి. వాళ్ల పరిశీలనకు, వాళ్ల అవగాహనకు ఆ విషయాలను తీసుకురాలేదు. ఈ రోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం ఈ రోజుకి లెక్కిస్తే 40,1035 మెగావాట్ల విద్యుత్ శక్తి మనకు అందుబాటులో ఉంది. ప్రపంచ మొత్తం, ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించే పారామీటర్స్‌లో తలసరి విద్యుత్ వినియోగం ఏ దేశంలో ఎక్కువుంది.
ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువుందని ప్రప్రథమంగా కొలిచే కొలమానం విద్యుత్‌శక్తి. అంతటి ప్రాధాన్యమైన విద్యుత్‌శక్తి మన దేశంలో 401035 మెగావాట్లు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వినియోగించలేని అశక్తతలో ఉంది మన భారతదేశం. నేనొక విషయం చెబితే మీరు నమ్మరు.. మన దేశంలో 4లక్షల మెగావాట్ల విద్యుత్‌శక్తి ఉంటే భారతదేశం ఏ రోజు కూడా 2లక్షల మెగావాట్లకు మించి విద్యుత్‌శక్తిని వినియోగించడం లేదు. మనందరం పేపర్లలో చూస్తూనే ఉన్నాం.. ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహించే గుజరాత్‌లోనూ భరించలేని కరెంట్ కోతలు, ఎండిపోతున్న పంట పోలాలు, రైతుల రాస్తారోకోలు ఉన్నయి. మన చుట్టూ ఉన్నరాష్ట్రాలు కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఏపీ, మహారాష్ట్ర కావొచ్చు ఇలా కోతలు లేని రాష్ట్రమే లేదు. ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలు తప్పడం లేదు. ఇబ్బంది పడని ప్రజలంటూ లేరు.
మణిదీపంలా తెలంగాణ..
చుట్టూ అంధకారం ఉంటే నా తెలంగాణ ఒక మణిదీపంలా వెలుగుతుందని గర్వంగా చెబుతున్నాను. ఏడేండ్ల క్రితం మనకు కూడా అంధకారమే. మనకు కూడా భరించలేని కరెంట్ కోతలే. కానీ మనం ఏం చేసినం.. వెలుగు జిలుగుల తెలంగాణ ఎట్లా అయింది. 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే తెలంగాణ ఎట్ల తయారైంది. ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే నేను ఓ మాట చెప్పాను… తెలంగాణ పెర్ఫార్మ్ చేసిన స్థాయిలో, తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు. ఒకవేళ చేసి ఉంటే.. దేశంలో కూడా కచ్చితంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబయి నుంచి కోల్కత్తా వరకు 24 గంటల కరెంట్ కచ్చితంగా లభించేది. ఎందుకీ దౌర్భాగ్యం.. దేశంలో కరెంటు లేకనా..? ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి..? ఇది భారతీయుల ఖర్మనా..? వారి ప్రాప్తా..? దీనికి సమాధానం చెప్పే వాళ్లెవరు. ఈ విషయాన్ని నేను మీ ముందు చెప్పడం కాదు.. దేశంలో ఉన్నటువంటి మొత్తం ముఖ్యమంత్రుల సమక్షంలో, కేంద్ర మంత్రుల కేబినెట్ సమక్షంలో, కేంద్ర అధికారుల సమక్షంలో, సాక్షాత్తు ప్రధాన మంత్రి అధ్యక్షత వహించిన నీతి అయోగ్ మీటింగ్‌లలో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన. ఈ దుస్థితి మంచిది కాదని, ఇదిగో ఈ దిశగా పని చేయండి, మేం కొంత విజయం సాధించాము.. మీరు కూడా ఆ మార్గంలో పని చేయండని చెప్పిన. కానీ లాభం లేదు.
దేశ ప్రజలకు.. కనీసం తాగు నీళ్లకు కూడా నోచుకోరా..?
ప్రకృతి లేదా భగవంతుడు భారతదేశానికి అందించిన మరో గొప్ప వరం నదులు. ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లోని నీటి లభ్యత 65 వేల టీఎంసీలు.. ఇంకా నాలుగైదు వేల టీఎంసీల నీటి లెక్కలు తేలాల్సి ఉంది. అంతర్జాతీయ గొడవల్లో భాగంగా టిబెట్ నుంచి వచ్చే నీళ్ల లెక్కలు తేలలేదు. ఇప్పటికే లెక్కించిన, నిర్ణయించిన నీటి కేటాయింపులు 65వేల టీఎంసీలు. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టులు, ఇతర ప్రయత్నాలతో 30వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటుంది. కానీ దేశంలో ఎక్కడ చూసినా.. నీటి యుద్దాలు. ఇది బుర్ర ఉండా…? లేకనా..? తెలివి ఉండా..? లేకనా..? శక్తి సామర్థ్యాలు ఉండా..? లేక అసమర్థతనా..? వివేకం ఉండా..? లేక అవివేకమా..? దీనికి కారణం ఎవరు. ఈ మాట కూడా నేను ప్రధాన మంత్రికి చెప్పిన. నీతి ఆయోగ్ మీటింగ్‌లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన. దేశంలో 65వేల టీఎంసీల నీళ్లు ఉంటే.. కావేరీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు యుద్ధం చేసుకుంటున్నాయి. సింధు, సట్లేజ్ నదుల కోసం రాజస్థాన్, హర్యాన, పంజాబ్ రాష్ర్టాల మధ్య ప్రతిరోజు యుద్ధం. ఇది ఎందుకు..? ఈ దేశానికి ఏమి దౌర్భాగ్యం..? దీని రహస్యం ఎక్కడ ఉంది. దేశ ప్రజలు కనీసం తాగు నీళ్లకు కూడా నోచుకోరా..? తాగునీరు లేదు సాగునీరు లేదు కరెంట్ లేదు… ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతై.. హోరెత్తుతయి. కానీ వాగ్ధానాల్లో హోరు.. పనిలో మాత్రం జీరో. ఈ దేశంలో ఎక్కడా ఎలాంటి పని జరగదు. మౌళికమైన వసతులు ఎక్కడా లేవు. 65వేల టీఎంసీల నీళ్లు కలిగి ఉండి తాగేందుకు నీళ్లులేని దుస్థితిలో ఉండటం ఏంటీ..? ఇది ఎవరి అసమర్థత..? దేనికి గీటురాయి..? వనరులు లేకపోతే వేరే విషయం.. కానీ అన్ని వనరులు ఉండి కూడా వాటిని ప్రజలకు అందించలేని దుస్థితి. ఇదిగో ఈ సమస్యలన్నీ పరిష్కరించబడాలి. చర్చలు జరగాల్సింది వీటిపైనా, పరిష్కారాలు కనుగోనాల్సింది వీటికి. అందుకోసం జరిగే ప్రస్తానంలో, ప్రయత్నంలో ఉజ్వలమైన, ఉద్విగ్నమైన పాత్రను మన తెలంగాణ రాష్ట్రం పోషించాలి. తప్పకుండా పోషించాలి. మన పాత్ర నిర్వహించాలి. దాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం ముమ్మరంగా చేయాలి.
దేశంలో ఏమి లేదని ఈ దౌర్భాగ్యం…
ఒకే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అత్యధికంగా యువ జనాభా కలిగిన దేశం భారతదేశం. మరి ఏమి దరిద్రం. 13 కోట్ల మంది భారతీయులు వారి ప్రతిభా పాటవాలను విదేశాల్లో ఖర్చు చేస్తున్నారు. భారత పౌరులకు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే… ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘అమ్మా నాకు గ్రీన్ కార్డు వచ్చింది. నాన్న నాకు గ్రీన్ కార్డు వచ్చింది.’ అని చెబితే ఇక్కడ ఆ తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారిని పిలిచి పార్టీలు చేసుకుంటున్నరు. ఏమిటీ దౌర్భాగ్యం. మనకు ఆస్తి లేకనా..? భూమి లేకనా..? నీరు లేకనా..? ఖనిజ సంపద లేకనా..? అటవీ సంపద లేకనా..? మేధోశక్తి లేకనా..? ఎందుకు ఈ దేశం ఇలా కునారిల్లుతుంది. ఎందుకు ఈ దేశంలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మనందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజా జీవితంలో పని చేస్తున్నాం కాబట్టి ఈ దుస్థితి దేశానికి ఇలాగే ఉండాలా..? లేదా ఈ దేశం విముక్తి కావాలా..? మనకు ఉన్నటువంటి వసతులను, వనరులను, యువశక్తిని వినియోగించి అద్భుతంగా పురోగమించాలా..?
ఏమీ లేని సింగపూర్ ఎలా ఎదిగింది…?
సింగపూర్‌లో ఏమీ లేదు. వాళ్లకు మన్ను కూడా లేదు. మట్టి కావాలంటే పొరుగు దేశం ఇండోనేషియా నుంచి కొనుక్కుంటరు. మట్టిని షిప్‌లలో తెచ్చుకుంటరు. మంచినీళ్లు కూడా వారి సొంతానికి లేవు. మలేషియా నుంచి కొని.. వాటిని ట్రీట్మెంట్ చేసి మళ్లీ మలేషియాకే అమ్ముతరు. వాళ్లు ఎత్తే ఒక అన్నం ముద్ద కూడా వాళ్లది కాదు. వాళ్లు ఎత్తే ఒక కూరగాయ ముక్క కూడా వాళ్ల దేశంలో పండదు. కానీ ఇప్పుడు సింగపూర్ ఆర్థిక పరిస్థితి ఏమిటీ..? మన ఆర్థిక పరిస్థితి ఏమిటీ..? ఆ దేశంలో ఏమీ లేదు.. మరెందుకు సింగపూర్ అంత జాజ్వలమానంగా ఉంది. అక్కడ ఏమీ లేదు కానీ వాళ్లకు తెలివి ఉంది. మన వద్ద అన్నీ ఉన్నయి కానీ తెలివి లేదు. ఏమీ లేనివాళ్ల దగ్గర ఒక్క తెలివుంటే మిగతా అన్ని ఉంటున్నయి.. అన్ని ఉన్నకాడా తెలివి లేక మనం కునారిల్లుతున్నాం. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పులాంటి నిజం. హేతుబద్దమైన వాదం. ఇది వాస్తవం కాకపోతే నేను నీతి ఆయోగ్‌లో చెప్పినప్పుడు.. వాళ్లు అప్పుడే ఖండిస్తరు కదా. అక్కడే వ్యతిరేకిస్తరు కదా..? రాజకీయ రణగోణధ్వనిలో హుంకారాలతో, హాంకారాలతో, ఆడంబరమైన నినాదాలతో, మైకులు పగిలిపోయే ఉపన్యాసాలతో 75 సంవత్సరాల జీవితం గడించి తప్పా.. దేశ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరలేదు.
ఊకదంపుడు ఉపన్యాసాలకు అభివృద్ధి జరగదు…
దేశంలో 10 గ్రామాలకు అవార్డులిస్తే.. అందులో ఒకటి నుంచి పది వరకు తెలంగాణకే వచ్చినయి. ఇవి ఎట్లా వచ్చినయి..? మంత్రి దయాకర్‌రావును, వారి డిపార్ట్మెంట్ను మనుసునిండా అభినందిస్తున్న. కానీ ఇవన్నీ ఎట్లా వచ్చాయి.. ఒట్టిగనే వచ్చాయా..? కేసీఆర్ మాట్లాడితేనో, దయాకర్‌రావు చేయ్యి ఊపితేనో వచ్చాయా..? ఇవన్నీ ఒట్టిగనే వస్తయా..? ప్రజల ఆశీర్వాదంతో మనం రెండు టర్మ్‌లు గెలిచినం. మొదటి టర్మ్‌లో 50 కోట్ల మొక్కలు పెంచి వాటిని గ్రామ గ్రామానికి, ప్రతి పట్టణానికి తీసుకెళ్లి ఇచ్చినం. కానీ పెంచలేదు.. అనుకున్న రీతిలో పనులు జరగలేదు. రెండోసారి గెలిచిన తర్వాత పని జరగాలంటే ఏం చేయాలని అలోచించినం. దీనికి చట్ట ప్రేరణ ఉండాలి, శాసన ప్రేరణ ఉండాలి, విధులు నిర్లక్ష్యం చేసిన వారికి శిక్షణ ప్రేరణ ఉండాలని కఠిన నిర్ణయం తీసుకొని నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చినం.
85 శాతం మొక్కలు దక్కకపోతే..‘నువ్వు టీఆర్ఎస్ పార్టీ అయినా ఫర్వాలేదు. నీ సర్పంచ్ పదవి పోతది’ అని చెప్పినం. నీ ఉద్యోగం పోతదని గ్రామ కార్యదర్శికి చెప్పిన. డిపార్ట్మెంట్ను మొత్తం స్ట్రీమ్‌లైన్ చేసినం. రాష్ట్రంలో 12769 గ్రామ పంచాయతీలు ఉంటే 12769 కార్యదర్శులను నియమించి వాళ్లకు బాధ్యతలు అప్పగించినం. పల్లె ప్రగతి అని పేరు పెట్టుకొని సంవత్సరానికి రెండుమూడుసార్లు డ్రైవ్ పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు మమేకంగా పని చేస్తే ఈ రోజు పదికి పది గ్రామాల్లో మనమే ఫస్ట్ వచ్చినం. ఇవి ఊరికే రాలేదు. ఉపన్యాసాలు చెబితే, ఊకదంపుడు మాటలు చెబితే, అలవోకగా రాజకీయాలు చేస్తే రావు. ఒళ్లు వంచాలే, మేధోమథనం చేయ్యాలే, మెదడు కరగతీయాలే, జ్ఞానం ప్రాప్తి చేసుకోవాలి.
పుట్టంగనే ఎవరికీ రాదు. జ్ఞానాన్ని స్వీకరించాలి. అన్ని మనకే తెలుసనే అహంకారాన్ని వదిలెయ్యాలి. తెలిసిన వారి దగ్గరి నుంచి తెలుసుకోవాలి. అవన్నీ చేసినం కాబట్టే ముందు ఉన్నం. పల్లెలకు, పట్టణాలకు అవార్డులు వరుస కట్టినయ్. వైద్య రంగంలో, విద్యారంగంలో ఇలా అనేక రంగాల్లో అవార్డులు వచ్చినయ్.. అవార్డుల పంట పండుతోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని వందల అవార్డులు వచ్చినయ్. మనం ఎక్కడా డంబాచారం కొట్టుకోలేదు. డబ్బాలు కొట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి కొన్ని వందల అవార్డులు ఇచ్చింది. సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను పిలిచి ఢిల్లీలోనే అవార్డులు ఇచ్చినరు. పనితీరును ప్రశంసించారు. అవార్డులు ఢిల్లీలో అందజేశారు. చిత్తశుద్ధి, కృషితో శ్రమిస్తే ఇదంతా సాధ్యమైంది.
దేశం లక్ష్యాన్ని కోల్పోయింది..
దేశం లక్ష్యాన్ని కోల్పోయింది. పరిస్థితి బాలేదు. నన్ను కొన్ని పార్టీల పెద్దలు కలిశారు. కమ్యూనిస్టు పార్టీ పెద్దలు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశారు. అందరం ఏకం కావాలి అన్నరు. దేనికోసం అని అడిగా. బీజేపీని గద్దె దించాలి, అదే మన లక్ష్యం కావాలని చెప్పినరు. ఇది చెత్త ఎజెండా అని చెప్పిన. దీనికోసం నేను మీతో రానని చెప్పిన. ఎవరినో గద్దె దించడానికో, ఎక్కించడానికో ఎజెండా అవసరం లేదని చెప్పిన. గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు. మారాల్సింది పార్టీలు కాదు దేశ ప్రజల జీవితాలు. ఆ దిశగా పనిచెయ్యాలని సూచించాను. దేశ జీవన స్థితి గతులు, మౌలిక సదుపాయాలు, దేశ భవిష్యత్తును మార్చే కార్యక్రమాలు రావాలి. అందరూ గౌరవంగా తలెత్తుకుని జీవించే పరిస్థితి తీసుకురావాలి.
ఒక రాష్ట్రం గురించి అడ్వైర్టెజ్‌మెంట్ విన్న. అందులో మహిళలు మాట్లాడతరు. స్వయం సహాయక సంఘాలు పెట్టుకున్నం అందుకే ఇప్పుడు రెండుపూటలా తింటున్నం. గ్రూపు లేకపోతే ఒకపూటే తిండి.. అనేది దాని సారాంశం. ఒక మిత్రునితో కలిసి అది చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగినయ్. మన తలసరి ఆదాయంలో సగం కూడా కాదు.. చారాణా కూడా తలసరి ఆదాయం లేని ఇంకో ముఖ్యమంత్రి ఉన్నరు. హైదరాబాద్ గడ్డమీద మాట్లాడతడు. మనకే నీతులు చెబుతడు. ఆయన ఉపన్యాసం ఇటీవలే ఎన్నికల సమయంలో విన్న.. గతంలో రేషన్ బియ్యం ఇచ్చేటోళ్లు కాదు. మేం రేషన్ బియ్యం ఇస్తున్నం కాబట్టి మాకు ఓటెయ్యండి అని అడుగుతున్నడు. ఎంత దారుణం. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మహిళలు ఒకపూట తిండి తినాల్నా.. ఇవాల మేము దాన్ని అధిగమిస్తున్నం అని చెప్పుకోవాలా. ఇప్పుడు కొత్తగా రేషన్ బియ్యం ఇస్తున్నమని గొప్పలు పోవాల్నా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటది.
సామూహిక లక్ష్యం ఉండాలి…
దేశంలో ఒక పక్కకు వెళితే 40 ఏళ్ల క్రితం మనం ఎట్లున్నమో ఇప్పుడు ఆ రాష్ట్రాలు అట్ల ఉన్నయ్. విచిత్రం ఏంటంటే.. బాధాకరం ఏంటంటే? 75 వేల తలసరి ఆదాయం ఉన్న ముఖ్యమంత్రి వచ్చి 2 లక్షల 75 వేల తలసరి ఆదాయం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి నీతి పాఠాలు చెబుతడట. ఇదీ పరిస్థితి. అది మనం మౌనంగా వింటున్నాం. దేశం ఒక మాట ఆలోచిస్తే బాధ కలుగుతది. నిజంగా నిలబెట్టి అడిగితే.. ఏమయితది. ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? మిత్రులు జూలూరి గౌరీశంకర్ కనిపిస్తున్నరు నాకు. ఈ దేశం ఏ లక్ష్యం వైపు పురోగమిస్తున్నది. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే వ్యక్తి చెప్పే నాలుగు మాటలు కాదు. ఒక పార్టీ ప్రవచించే నాలుగు మాటలు కాదు.
దేశం లక్ష్యం అంటే దేశ ప్రజల సామూహిక లక్ష్యమై ఉండాలి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ పశ్చిమ కనుమల నుంచి తూర్పు దిశ వరకూ దేశం నలుమూలల ఉండే ప్రజల సామూహిక లక్ష్యం, గమ్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా దేశమంతా సామూహిక ప్రయత్నం చేయాలి. అట్ల అన్ని దేశాలు చేస్తయి. మరి భారతదేశం ఎందుకు అలా చేయడం లేదు. ఎందుకు గతి తప్పుతోంది. ఎందుకు లక్ష్యం లేకుండా చీకట్లో బాణంలా, చీకట్లో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతా ఉంది. మనం మౌన ప్రేక్షకులుగానే ఉండాలా? లేక.. దేశం ఒక సామూహిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో, నియంత్రిత విధానంతోని, పట్టుదలతో పురోగమించి అద్భుతాలు సాధించాలా? ఏం జరగాలి.
ప్రగతి ఎజెండా కావాలి…
1980 వరకూ భారతదేశ జీడీపీ కంటే చైనా జీడీపీ తక్కువ. భారతదేశంలో పండే పంటల కంటే చైనాలో పండే పంటలు తక్కువ. వ్యవసాయ అనుకూలమైన భూమి కలిగి ఉండడంలో భారత్ కంటే చైనా తక్కువ. మరి ప్రస్తుతం చైనా పరిస్థితి ఏంటి? నేడు ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తి కలిగి ఉన్న దేశం ఏది అంటే చైనా. మరి మనమెక్కడ ఉన్నం. మరి మనం ఏ దిశగా పోతున్నం. మన రాష్ట్రంలో ఒక జిల్లా అంత ఉండదు ఇజ్రాయిల్ దేశం. అక్కడి నుంచి ఆయుధాలు కొనుక్కుంటా ఉన్నం. మన తాలూకా అంత ఉండే ఆస్ట్రియా దేశం నుంచి పంపులు తెచ్చుకుంటున్నం. ఏం ఖర్మ ఇది. ఏం దుస్థితి ఇది. దీని గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి.
యావన్మంది దేశ ప్రజలు ఒకతాటిపై నడవలేని దుస్థితికి భారతదేశం మారడానికి కారణమేంటి? ఈ బలహీనత ఎవరిది? ఇంత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన యువశక్తి, ఆపారమైన అటవీ, ఖనిజ, జల సంపదలు, బంగారం పండించే 44 కోట్ల ఎకరాల భూములు, కష్టం చేయడానికి సిద్ధంగా ఉన్న శ్రమ జీవులు అందరినీ కలిగి ఉండి ఎందుకూ కొరగాని దేశంగా ఎందుకు ఉన్నది. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చర్చించాల్సిన అంశం..కావాల్సింది, రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు. ఇప్పటికే చాలా వచ్చినయ్. కానీ ఏం సాధించినయ్. రాజకీయ పునరేకీకరణలు కావు. డొల్ల మాటలు, కల్ల మాటలు కావు. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుతమైన దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి.
వలసలు రివర్స్…
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాం. అద్భుతమైన ఆదర్శంగా ఉన్నాం. మనందరికీ తెలుసు పాలమూరు జిల్లాల్లో ఊరూరుకు బొంబాయి బస్సులు పోయేటియి. సగం జనాభా 15, 16 లక్షల మంది కడుపు చేతపట్టుకుని అన్నమో రామచంద్రా అంటూ వలసపోయిండ్రు. ఈ రోజు ఏం జరుగుతాంది. తెలంగాణ వలసలన్నీ రివర్స్ వచ్చేసినయ్ ఎప్పుడో. ఏ వ్యక్తి వలసపోతలేడు. రివర్స్ ఏమైంది. బీహార్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ తదితర 11 రాష్ట్రాల వాళ్లు సుమారు 25, 30 లక్షల మంది వలసల కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నరు. ఈ రోజు గర్వంగా చెబుతున్న. ఇవాళ బీహార్ హమాలీలు లేకపోతే తెలంగాణ రైస్ మిల్లులు నడవవు. డెయిరీ ఫామ్‌లలో పాల ఉత్పత్తి నిలిచిపోతది.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి రియల్‌స్టేట్ రంగంలో 95 శాతం మంది బీహార్, ఉత్తరప్రదేశ్ కార్మికులే ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రం ప్రగతికాముఖంగా సాగుతుంది కాబట్టి. పనిదొరుకుతుంది. శాంతిభద్రతలు బాగున్నయ్ కాబట్టి. సాయంత్రానికి వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకోవచ్చు కాబట్టి ఇతర రాష్ట్రాల వారు వస్తున్నారు. అందరికీ గుర్తుంటది. కరోనా మహమ్మారి సమయంలో అన్నమో రామచంద్రా అని ప్రజలు కేంద్రం దిక్కుమాలిన విధానాల వలన లక్షల కోట్ల మంది ప్రజలు నేషనల్ హైవేల మీద చస్తూ బతుకుతూ పోయే సందర్భంలో మన చీఫ్ సెక్రటరీ, డీజీపీకి ప్రత్యేక ఆదేశాలిచ్చాం. మీరు తెలంగాణ ప్రగతి రథచక్రాలను ముందుకు తీసుకుపోయేవాళ్లు.
చమట బిందువులు ఖర్చుపెడుతున్నవారు. మిమ్ములను మా వాళ్లలాగే చూసుకుంటామని మన వాళ్లకు లాగానే రేషన్ బియ్యం, డబ్బులు అందజేశాం. మందులిచ్చి, 178 రైళ్లు పెట్టి, వాళ్లకి టిక్కెట్ ఖర్చులు, భోజనం, పండ్లు ఇచ్చి సికింద్రాబాద్ నాంపల్లి నుంచి పంపించినం. వెళ్లేప్పుడు వాళ్లందరూ జై తెలంగాణ అనుకుంట పోయినారు. వెళ్లారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టగానే మళ్లీ మనం పిలవకుండా ఇప్పుడు వచ్చి పనిచేస్తున్నరు. ఎందుకంటే ఇక్కడ మంచి పరిస్థితి ఉంది. చేతినిండా పనిదొరుకుతుంది. కడుపునిండా అన్నం దొర్కుతది. రక్షణ దొర్కుతది. మంచిచెడ్డలు చూసే ప్రభుత్వముంది అని చెప్పి ఒక్క మనిషి లేకుంట వాపస్ వచ్చుడే కాదు కొందరు మరో 10మందిని వెంటబెట్టుకుని వచ్చినారు.
టీఆర్ఎస్లానే బీఆర్ఎస్ కావాలంటున్నరు..
ఒక్క మాటలో చెప్పాలంటే చెయ్యగలిగే సామర్థ్యముంటే, సంకల్పముంటే.. చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశం.. వసతులు, వనరులను కలిగి ఉన్నది నా భారతదేశం. లేక బాధపడితే వేరు కానీ కలిగి ఉండీ కటకటవడుతున్నది. దుఃఖపడుతున్నది. దీనికి ఏదో నివారణ జరగాలె. దీనికోసం కేసీఆర్ ఇవాళ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తడా? ఇంకోటి ప్రకటిస్తడా? అంటే ప్రాసెస్ జరుగుతది. తెలంగాణ కోసం మనం ఎట్లయితే ప్రాసెస్ చేసినామో? ఏ ప్రాసెస్ ద్వారా తెలంగాణ తెస్తమని నమ్మినామో? అట్లనే అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి కూడా ప్రాసెస్ జరగాలె. ఆ ప్రాసెస్‌లో ఏం జరుగుతది భవిష్యత్‌లో తెలుస్తది. సమయం తేల్చుతది. ఈ మధ్య నేను జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి విలేకర్లు ఏం సారు యాంటి బీజేపీ ఫ్రంట్ ఎప్పుడు పెడుతున్నరు అని అడిగారు. నాకు కోపం వచ్చి ఇది యాంటి కాదు ఫర్ కాదు.. ఏదన్న పెడితే గిడితే.. భారతదేశ ప్రజల అనుకూల ఫ్రంట్ ఉంటది తప్ప దీనికి వ్యతిరేకం.. దానికి దోస్తి దందా ఉండది అని చెప్పిన. భారత ప్రజలను, దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండా ఉంటదని తేల్చిచెప్పిన.
దేశం బాగుపడడానికి మన రాష్ట్రం నుంచే ఏదన్న జరిగితే అది మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ కోసం ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, దేశ గతిని మార్చడానికి, స్థితి మార్చడానికి.. దేశాన్ని సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి, ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ఏజెండా, కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలలా వ్యాపిస్తే అది దేశానికి, మన రాష్ట్రానికే గర్వకారణం. ఏదో చిల్లరమల్లరగా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడమో? నాలుగు పార్టీలను ఒకటి చేయడమో? ఒకరితో దోస్తానా కట్టడమో కావాల్సిందీ. ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు.. రాజకీయకూటమి కాదు కావాల్సింది.
దేశానికి కావాల్సిందీ ప్రత్యామ్నాయ ఎజెండా కావాలె. ఆ దారులు వెతకాలి. నూతన వ్యవసాయవిధానం రావాలె. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాలె. నూతన ఆర్థిక, పారిశ్రామక విధానం రావాలె. ప్రతివాడు పనిచేసే అవకాశం కావాలె. అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలె. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలె కానీ, కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యం, ఎల్లయ్యనో మల్లయ్యనో ప్రధానమంత్రిని చేయడం కోసమో, ఏదో స్వకుచ మర్ధనాలు చేసుకోవడమో? స్వోత్కర్ష చేసుకోవడమో కాదు దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం. అందుకు కావాల్సిన సిద్ధాంత ప్రాతిపదిక. అందుకు అవంలంభించాల్సిన ఎజెండా. ఆచరించాల్సిన మార్గం.. కావాలె దేశానికి. అది వస్తే చాలా అద్భుతంగా దేశం బాగుపడతది. ఉజ్వలమైన దేశం తయారైతది. ఇవాళ మా యువ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఒక పేపర్ల ఒక వ్యాసం రాసిండు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేయాలె. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేయాలె అని పేపర్ల చదివిన. అలాంటి ఆలోచనలు రావాలె.
టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి..
ఇరవైఏండ్ల కింద దిక్కులేని, దిశా దశ లేని, అయోమయ పరిస్థితిలో ఉన్న తెలంగాణ, ఒక పార్టీ, ఒక నాయకుడు లేని తెలంగాణ ఇవాళ రెండు దశాబ్దాలలో అద్భుతమైన దశకు చేరుకుంది. సుస్థిరమైన, సుసంపన్నమైంతన వనరులతో, సువ్యవస్థీతమైన సుమారు రూ. 1000 కోట్ల ఆస్తులను కలిగి శ్రీరామరక్షగా తెలంగాణకు మిగిలిపోయే రాజకీయ పార్టీ. ఒకనాడు ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియని పరిస్థితుల్లో, స్వర్గీయ తెలంగాణ కొండాలక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడుపోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. కనీసం మనకు కార్యాలయం లేదు. ఈరోజు సగర్వంగా, సమున్నతంగా ఇవాళ దేశ రాజధానిలో ఎనిమిదిన్నర కోట్లతో స్థలం కొనుక్కొని, ఇంకో 8, 10 కోట్లు ఖర్చు వెట్టి బిల్డింగ్ కడతాఉన్నది. మరో ఆరు, ఏడు నెలల కాలంలో బిల్డింగ్ అందుబాటులోకి రాబోతుంది. దేశ రాజధానిలో, రాష్ట్ర రాజధానిలో, 31 జిల్లా కేంద్రాల్లో అద్భుతమైన కార్యాలయాలను కలిగి ఉన్న టీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ తెలంగాణ ప్రజల ఆస్తులు. టీఆర్ఎస్ పార్టే తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ ఆస్తిత్వం కోసం, ఉనికి కోసం, హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం అనుక్షణం కాపలాదారుగా ఉండే పార్టీ టీఆర్ఎస్ పార్టీ.
దేశానికి పాఠాలు చెప్పేస్థాయి తెలంగాణ దళితసమాజం..
అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే లక్ష్యంతో, స్థిరమైన నిర్ణయంతో, స్పష్టమైన వ్యూహంతోని, అవగాహనతోని ఈ దేశానికే పాఠం నేర్పే బృహత్తరమైన కొత్త సిద్ధాంతానికి, కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గుండెల నిండుగా పూర్తి అవగాహనతోని ఏదో ఆషామాషిగా, ఓట్ల కోసమో, నినాదాల కోసం చిల్లరమల్లర రాజకీయాల కోసం కాకుండా దళితబంధు కార్యక్రమం చేపట్టినం. దేశానికి, ప్రపంచానికి ఆదర్శం కాబోతున్నది. దళితజాతిలో ఉన్న అద్భుతమైన మాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు వెలుగులోకి రాబోతున్నాయి. దళితబంధులో ఉన్న గొప్పదనం పదిలక్షలు ఇవ్వడం కాదు. తమాషా చేయడం కాదు. దళితబంధు ద్వారా మనం ఇచ్చే సందేశం.. పెట్టుకున్న లక్ష్యం తెలంగాణ అద్భుతంగా అమలు చేస్తున్నది. ఒకటే ఒక మాట నేను చెబుతా ఉన్న.
దళితబంధులో మూడు పార్శాలు ఉన్నాయి. 17.5 లక్షల కుటుంబాలకు సంవత్సరానికి 2లక్షల మంది చొప్పున, ఏ నిబంధనలు లేకుండా, షరతులు లేకుండా నచ్చిన ఉపాధి ఎంచుకునేందుకు రూ.10లక్షలు ఇవ్వడం. రెండవది మెడికల్ షాపులు, ఫర్టిలైజర్, హాస్టల్ సప్లయ్‌లలో, వైన్స్ బార్‌షాపులు ఇలా ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చే అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించడం. ఇచ్చే రూ.10 లక్షలతో ఒక పనిచేసుకోవచ్చు. రెండు పనులు చేసుకోవచ్చు. ఆంక్షలు లేవు. దళిత బంధులో మూడు పార్శాలు, ఒకటి ఆర్థిక ప్రేరణ, అన్నింట్లలో రిజర్వేషన్, మూడోది అద్భుతం. ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని సపోర్ట్ సిస్టమ్. ఇదే స్ఫూర్తితో పథకం అమలు కావాలి గాబట్టి. ఇప్పటివరకు దేశంలో అమలయ్యే పథకాల తీరు పంచుకుంటు పోవడం తప్ప ఆలోచించే పద్ధతి లేదు. ప్రభుత్వ పద్ధతిలో ప్రజలను రెండు రకాలుగా చూస్తది.
ఒకటి బిలో పావర్టీ లైన్, ఎబౌ పావర్టీ లైన్. పదిలక్షలు ఇచ్చినం గనుక బీపీఎల్ కుటుంబం ఏపీల్ లోకి పోతుంది. మళ్లీ ఆ కుటుంబం బీపీఎల్‌కు దిగజారిపోకుండా చూడడమే దళితబంధు గొప్పతనం. అందుకోసం ఏర్పాటు చేసిందే దళితరక్షణ నిధి. ఊహించని పరిస్థితుల్లో దళితబంధు లబ్ధిదారుల్లో ఎలాంటి కష్టం వచ్చినా ఆ రక్షణ నిధి నుంచి ఆ కుటుంబాన్ని నిలబెడతరు. అంతటి గొప్ప నిర్మాణం ఉంది. ఒక ఆరేడు ఏండ్లలో తెలంగాణ దళిత సమాజం దేశానికే పాఠాలు చెప్పగలిగే గొప్ప సమాజంగా తయారవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం ఏ పని మొదలుపెట్టినా పట్టుదలతోని, చిత్థశుద్ధితోని, అవగాహనతోని, విషయ పరిజ్ఞానంతోని, విశాల దృక్పథంతోని చేస్తున్నాం కాబట్టి ఈ పథకం అంతటి అద్భుతాలను చేస్తుంది. దళితజాతి బిడ్డలు 10 ఇస్తే 20 చేస్తరు. అవసరమైతే కోటి చేస్తరు. వారందరికీ గౌరవ ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రతి గ్రామంలో విజయవంతంగా అమలు చేయాలె. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడంలో అద్భుతమైన పథగామిగా నిలుస్తుంది.
ఏం ఆశించి విద్వేషాలు రెచ్చగొడుతున్నరు..?
దేశంలో ఈరోజంతా ఏం జరుగుతుందో.. ఇది కూడా ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టాలె. అప్పుడే ప్రజలకు అర్థమైతది. ఏం జరుగుతా ఉంది. దేశంలో. ఏం ఉపన్యాసాలు వింటా ఉన్నాం. జాతిపిత మహాత్మాగాంధీనే దూషణలు చేసే దేశమా భారతదేశం. ఇదేం పెడధోరణి. ఇదేం దుర్మార్గం. ఆయన లక్షాధికారిగా ఉండి దేశం స్వతంత్య్రం కోసం దశాబ్దాల పాటు జైళ్లలో మగ్గి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి జాతిపితగా పేరుతెచ్చుకుని వ్యక్తిని దూషించడమా. ఇది సంస్కృతా. ఇది పద్ధతా? ఎందుకీ విద్వేషం. ఏం ఆశించి ఇది చేస్తున్నరు. ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటిది మంచిదా. ఏం వింటా ఉన్నాం. ఏం జరుగుతా ఉంది. కూలగొట్టడం తేలికనే. విధ్వంసం చేయడం తేలికనే. అదే ఏదయినా నిర్మించాలంటే ఎంత సమయం పడతది.
ఈ రోజు మన పొరుగున కర్నాటక రాష్ట్రం బెంగుళూరు సిలికాన్ వ్యాలీగా పేరు. ప్రత్యక్షంగా ఆ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది..? హిజాబ్..హలాల్..పూలు కొనొద్దు..?పండ్లు కొనొద్దు.? ఇదా..? భారత రాజ్యాంగం ప్రకారం ఏ పని ఎవరైనా స్వీకరించవచ్చు. ఏ వృత్తిని ఎవరైనా చేయవచ్చు. దానికి కులం, మతం తేడాలేదు. కానీ ఇదెక్కడి దుర్మార్గం. ఇదెక్క అన్యాయం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
‘ఒక వేళ ఆ దేశంలో మీరు మా మతస్థులు కాదు..కులస్థులు కాదు..గెటవుట్..’ అంటే ఆ 13 కోట్ల మంది ఇండియాకు వాపస్ వస్తే..ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదా?.ఈ మత విధ్వేషాలు పెచ్చరిల్ల చేసే ఈ సన్నాసులు వాళ్లను సాదుతారా..? ఏం జరుగుతది ఈ దేశంలో..ఎటుపోతది..ఆల్రెడీ కువైట్ దేశంలో 11 మంది ఎంపీలు వాళ్ల ప్రభుత్వానికి ఉత్తరాలు రాసిండ్రు. ‘ఇండియాలో చాలా పిచ్చిపిచ్చిగా జరుగుతా ఉంది. ఈ భారతీయులను మన దేశంలో ఉండనిద్దామా?..వెళ్లగొడదామా?.అని మనం ఆలోచన చేయాలి’అని వాళ్లు లేఖల్లో చెప్పారట. ఇది మంచిదా?..దేనికి మంచిది..ఎవరికి మంచిది..? ఏం సాధిస్తది..?ఏం ఆశించి ఈ దుర్మార్గాన్ని పెంచుతున్నారు?..ఎవరి మంచిని ఆశించి చేస్తున్నారు?..దేశం అన్ని రంగాల్లో నాశనం అవుతున్నది.
మత పిచ్చా…సోదరభావంతో అభివృద్ధా..? ఆలోచన చేయాలి…
పెనం మీది నుంచి పోయ్యిలో పడ్డట్టుందని, పోయిన సర్కారే మంచిగుండే అని దేశ ప్రజలు చర్చించుకుంటున్నరు. జీడీపీ పోయింది. పరిశ్రమలు మూతపడుతున్నయి. నిరుద్యోగం పెరిగింది. ఆకలి పెరిగింది. రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారు.. అంతులేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. రూ. 30 వేలు ఉన్న స్టీలు రూ. 90 వేలకు పోయింది. సిమెంట్ బస్తాల ధరలు కొండెక్కి కూసున్నయి. సామాన్యుల ప్రజలకు భారంగా ఉంది. ఇన్ని సమస్యలతో దేశం సతమతం అవుతుంటే దీని మీద దృష్టి లేదు. మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, కరెంటు సక్కగ రాదు. దీనిమీద దృష్టి లేదు. ఏదో చెప్పి ఒక గోల్మాల్చేసి ఒక ద్వేషం..విద్వేషం.. దేశానికి ఒక పిచ్చి లేపి. రాజకీయ పబ్బం గడుపుకునే ఒక దుర్మార్గం.
సమసిపోయిన గాయాలపై కారం చల్లే పరిస్థితి. ఎంత సిగ్గు చేటు అంటే ఏదైనా ఒక రాజకీయ పరిస్థితి వస్తే..ఒక విద్వేషాన్ని రేపాలి. ఇగో పుల్వామా?..ఇగో సర్జికల్ స్ట్రైక్..? ఇగో కశ్మీరీ ఫైల్స్..కశ్మీర్ పండితులే టీవీల ముందుకు వచ్చి చెప్పారు. ‘మారిన గాయాల్ని మళ్లా ఎందుకు రేపుతున్నారండి..మా పుండుమీద కారం మళ్లా ఎందుకు చల్లుతున్నరు..ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి. అది చేతకాదు కానీ, మా పేరుమీద రాజకీయాలు చేస్తారా?.’అని వాళ్లే మాట్లాడుతున్నరు. ఇది ఎంత దౌర్భాగ్యం. ఏం మత పిచ్చి..ఏం విధ్వేషం. ప్రేమతోని, అనురాగంతోని, సౌభ్రాతృత్వంతోని..సోదరభావంతోని ఒకరికొకరు భుజం ఆని..ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ఉజ్వల భారత నిర్మాణం జరగాలా..? ఈ పిచ్చి కొట్లాటలు పెడితే దేశానికి మంచిది కాదు.
వక్రగతిని మార్చేందుకు టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలి..
ఐటీలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడేండ్లలో తెలంగాణకు సుమారు 2 లక్షల 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 20వేల పరిశ్రమలు కొత్తగా వచ్చాయి. 14 నుంచి 15 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌లో విమానం దిగితే అంతా మంచిగుంటది. సల్లగా ఉంటది..శాంతిభద్రతలు బాగుంటాయి. అన్ని భాషలు మాట్లాడేవాళ్లు ఇక్కడ ఉంటరు అని అంటే పెట్టుబడి పెట్టేవాళ్లు మన దగ్గరికి వస్తరు కానీ, విమానం దిగుడు దిగుడే కత్తులతోటి ఊరేగింపులు తీస్తరు..బాంబులు ఏసుకుంటరు..కర్ఫ్యూలు పెడతరు అంటే ఎవరైనా వస్తరా?..పరిశ్రమలు వస్తయా?..పెట్టుబడులు వస్తయా?..ఉద్యోగాలు వస్తయా?..ఏం జరుగుతది..దేశ రాజధానిలో దేవుడి పేరిట జరిగే ఊరేగింపులో కత్తులు పట్టుకుని ఊరేగింపులా?..తుపాకులతో ఊరేగింపులా?..ఈ భారత దేశమేనా మనకు కావాల్సింది. ఇందుకోసమేనా మహాత్ముడు కలలు కన్నది?..ఇదేనా ప్రజలు కోరుకుంటున్న భారతదేశం?. ఈ కత్తుల కోలాటాలు ఎవరికి కావాలి?..ప్రజలకు కావాల్సింది ప్రాజెక్టులల్ల నీళ్లు.. కరెంటు.. మంచినీళ్లు.. బతుకుదెరువు తొవ్వలు.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు. వాటన్నింటినీ పక్కన పెట్టి కత్తులు పట్టుకుని మతం పేరిట, కులం పేరిట పొడుచుకుని చావుర్రి..విద్వేషాలు పెంచుకోండి అనడం ఏం దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. ఇట్లా అయితే ఎవరు సురక్షితంగా ఉండరు..ఏది మంచి జరగదు..ఇవేం గలీజు రాజకీయాలు ఈ దేశంలో.. ఈ దేశం ఇట్లనే నాశనం కావాల్నా?..లేదు టీఆర్ఎస్గా మనం కూడా ఒక పాత్ర పోషిద్దామా?..మన శక్తిని ప్రదర్శించి వక్ర గతిలో పోతున్న ఈ దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి మంచి మార్గాన్ని చూపాలా?..వద్దా..? ఇది మన ముందు ఉన్న ప్రశ్న..
గత అనుభవాల నుంచైనా గవర్నర్ వ్యవస్థ గుణపాఠాలు నేర్వాలి..
ఎటువంటి పరిణామాలు చూశాం.. ఈ దేశంలో అనేక సందర్భాల్లో అనేక మంది మహానాయకులు వచ్చారు. మంచి మంచి సందేశాలు ఇచ్చారు. ఆచరించి చూపెట్టారు. ఇవాళ గవర్నర్ల వ్యవస్థ..మహారాష్ట్ర క్యాబినేట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి మహారాష్ట్ర గవర్నర్‌కు పంపితే..ఏడాది అవుతుంది. తన దగ్గరనే ఫైల్ పెట్టుకుని కూర్చున్నడు. తమిళనాడు శాసన సభ బిల్లు పాస్ చేసి పంపితే, తమిళనాడు గవర్నర్ ఒక పెడధోరణి, ఒక వింత ధోరణి. బెంగాల్లో పంచాయతీ, మహారాష్ట్రలో పంచాయతీ, తమిళనాడులో పంచాయతీ, కేరళలో పంచాయతీ..ఇదా జరిగేది.
పెద్దలు, పూజ్యులు స్వర్గీయ ఎన్టీ రామారావుగారు పార్టీ పెట్టారు. నిష్కల్మషమైన మనసుతోటి ప్రజలకు నావల్ల ఏదైనా మంచి జరగాలని పార్టీ పెట్టారు. ఆ రోజు యువకులుగా మేం అంతా కలిసి ఆ పార్టీలో పనిచేశాం. ఎటువంటి కొరకొర.. కిరికిరి లేకుండా అద్భుతంగా ఆయన 200 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చారు. చెప్పిన పని ఆచరిస్తూ ముందుకు పోతున్నరు. కానీ, ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించి..స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావుగారిని చాలా కుఠిలంగా, కుట్రపూరితంగా పదవి నుంచి తొలగించారు. అది మనమంతా కండ్లారా చూశాం. నేను చెప్పేది ఎక్కడో భారతమో..రామయణ కథో కాదు..ఇదే రాష్ట్రంలో..ఇదే హైదరాబాద్‌లో జరిగిన చరిత్ర.
ఏం జరిగింది. ఆనాడు మా అంత శిపాయిలు లేరని భావించిన కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి..ఇదే ఎన్టీరామారావుగారిని మళ్లీ అధికారంలోకి తెచ్చేదాకా కొట్లాడారు. ‘మీకు బుద్ధిలేదా..సిగ్గు తెచ్చుకోండి..’అని చెప్పి ఎన్టీరామారావును ముఖ్యమంత్రి కుర్చీమీద కూర్చునేదాక కొట్లాడి సాధించారు. ఇది జరిగిన చరిత్రే కదా..దీని తర్వాతైనా బుద్ధి జ్ఞానం రావొద్దా..? ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి..? ఎన్టీ రామారావుగారితో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్ అవమానపడి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. తొలగించబడ్డారు. దాని నుంచి దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా..దాని నుంచి పరిణతి రావాలి కదా?..కానీ, ఉల్టా ఈ రోజు ఏం జరుగుతా ఉంది?..చాలా వక్రమార్గంగా జరుగుతోంది.
ప్రజల ఎజెండాతో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలి..
ప్రజల కోసం రాజ్యాంగమా?..దానికి ఉల్టానా?..ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో..? రాజ్యాంగ సంస్థల గతి ఏమైతా ఉంది. రాజ్యాంగ ప్రతిపత్తి ఏమైతా ఉంది..రాజ్యాంగ రక్షణలు ఏమైతా ఉన్నాయి. ఒక మృగాలలాగా దేశ రాజధానిలోనే కత్తులు, తుపాకులు పట్టుకుని పట్టపగలు తిరిగే పరిస్థితా..ఇది రాజ్యాంగమేనా?..ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తా..? అందుకే నేను కోరుతున్నదల్లా..ఈ దేశం సరైన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే..రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టుగా అమలు కావాలంటే..అంబేద్కర్‌గారు కలలు కన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే..అవసరమైనటువంటి మౌలికమైన మార్పులు, చేర్పులు చేసుకుని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతోటి, ప్రజల ఎజెండాతోటి కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో తప్పకుండా ఆవిర్భవించాలి. సందర్భానుసారం స్పందించే గుణం భారత దేశ లక్షణం.
ఎస్ ఇండియా రియాక్ట్స్…ఇండియా బుద్దూగాళ్ల దేశం కాదు..ఇండియా బుద్దిజీవుల దేశం..ఎస్ ఇండియా రియాక్ట్స్..తప్పకుండా వస్తాయి శక్తులు..మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలేదా?..పెద్ద శక్తిపుట్టలే..? గాలి దుమారం లేపలే…? తెలంగాణ రాష్ట్రం సాధించుకు రాలే..?అట్లనే దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి..తుఫాన్ సృష్టించి, ఈ దుర్మార్గాన్ని అంతా తరిమివేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా సముజ్వలంగా తెలంగాణ కూడా..తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది. మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నా..జై తెలంగాణ.. జై హింద్.