హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి భారీగా డబ్బులు దండుకునే కాం గ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని రచించింది. ‘ప్రివిలేజ్ సెస్’ పేరిట ఏటా ఒక్కో బార్ యజమాని నుంచి అడ్డగోలుగా 8 నుంచి 20 శాతం (సుమారు రూ.30 లక్షలు) వరకు అదనంగా వసూలు చేసేందుకు స్కెచ్ వేసింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. సర్కార్ తీరును నిరసిస్తూ సోమవారం (5వ తేదీ) నుంచి బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్టు ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,200లకుపైగా బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి.
ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉంటే మళ్లీ ఫీజులా?
వైన్స్‌లకు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇది చాలదన్నట్టు ప్రభుత్వం కొత్త బార్లకు అనుమతులు ఇచిందని బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ దామోదర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్సు ఫీజు రూపేణా ఏటా ప్రభుత్వానికి రూ.33 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు చెల్లిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే ‘ప్రివిలేజ్ ఫీజు’తో తమపై అదనంగా రూ.30 లక్షల భారం పడుతుందని వాపోయారు. గతంలో ఎప్పుడూ లేని ఇలాంటి ఫీజులను ఇప్పుడే ఎందుకు వసూలు చేయబోతున్నారని, ఇలాగైతే తమ బిజినెస్ ఎలా నడవాలని ప్రశ్నిస్తున్నారు.
ఆబ్కారీ భవన్ ముట్టడికి పిలుపు
ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలన్న డి మాండ్‌తో సోమవారం ఉదయం ఆబ్కారీ భవన్‌ను ముట్టడించి, ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ల యజమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చింది. ధర్నాపై ప్రభుత్వం నుంచి ఎ లాంటి స్పందన లేకుంటే నిరాహార దీక్షల కు దిగుతామని, తమ డిమాండ్ నెరవేరేవరకు రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తామని స్పష్టం చేసింది.