Air India | ఎయిరిండియాకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పూనుకున్నది నూతన యాజమాన్యం టాటా సన్స్. మహారాజాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సిద్ధం చేసిన ప్రణాళికను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బయట పెట్టారు. ఆర్థికంగా సమర్థవంతమైన సంస్థగా మహారాజాను తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతే కాదు అంతర్జాతీయంగా, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ ఎయిర్‌లైన్స్‌గా నిలుపుతామని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
మహారాజను సంస్థాగతంగా రీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉందని చంద్రశేఖరన్ చెప్పారు. సంస్థలో పూర్తిగా పరివర్తన తేవాల్సి ఉందన్నారు. సంస్థ అవసరాలకు అనుగుణంగా నూతన విమానాలను కొనుగోలు చేస్తామన్నారు. టాటా సన్స్ ఆధీనంలోని ఇతర సంస్థల మాదిరిగా మహారాజను లాభాల బాట పట్టిస్తామని తేల్చేశారు. ఎయిరిండియాతో ప్రపంచంలో నలుమూలల భారత్‌ను అనుసంధానిస్తామని చెప్పారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబంగా రూపుదిద్దుతామని చెప్పారు.
ఇప్పటికే టాటా సన్స్ అనుబంధ తాజ్ హోటల్స్, తనిష్క్, టాటా సాల్ట్, జాగ్వార్ లాండ్ రోవర్ వంటి బ్రాండ్లతో 60 కోట్ల మంది భారతీయులకు అనుబంధం ఉందని చంద్రశేఖరన్ చెప్పారు. నూతన యాజమాన్యం ద్వారా ఎయిరిండియాను బలోపేతం చేస్తామన్నారు. కస్టమర్ సర్వీసెస్‌లో ఉత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్ని విధాల మహారాజను ఆధునీకరిస్తామని తెలిపారు.