సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తాను పనిచేసే ప్రాంతంలో అక్రమ దందాలపై ఆ కానిస్టేబుల్ దృష్టి పెడతాడు.. ఒకవైపు డబ్బుల వసూళ్లతో పాటు అక్రమ దందాలపై దాడులు చేసి కేసులు పెట్టొద్దంటే మీరు కావాలంటూ అక్కడి మహిళలను లొంగదీసుకుని.. వారి కుటుంబాల్లో చిచ్చు పెడతాడు.. పాతబస్తీలోని ఓ ప్రాంతంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో పాటు కానిస్టేబుల్ అరాచకానికి ఆ నిర్వాహకుడి కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో విషయం బయటకు వచ్చింది. ఇటీవల పోలీస్స్టేషన్ల సరిహద్దులు మారడంతో ఆ ఏరియా పోలీస్‌స్టేషన్ మారిపోయింది. దీంతో గతంలో పాత స్టేషన్లో, తాజాగా కొత్త స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేసినా తిరిగి పోలీసులు బాధితుడినే ఇబ్బంది పెడుతున్నారు తప్ప.. తమ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తి కాబట్టి అతనిపై చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోయాడు.
పాతబస్తీలోని ఒక మాస్ఏరియాలో బాధితుడు కొన్ని సంవత్సరాలుగా బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో బాధితుడి షాప్ ఉన్న ఏరియా పీఎస్‌లో పనిచేసి ప్రస్తుతం సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్.. ఆ బెల్డ్ షాపు నిర్వాహకుడిని బెదిరిస్తూ.. అతని భార్యపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోవడం కోసం ఆ షాపుపై పలుమార్లు దాడు లు చేసి.. వారిపై కేసులు పెట్టించి బెదిరించాడు. తరువాత తరచుగా ఆమెతో చనువు పెంచుకుని బెల్ట్‌షాపులో ఏది దొరికినా కేసులు పెట్టొద్దంటే నువ్వు కావాలి.. అంటూ ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత సంబంధం కొనసాగిస్తూనే అదే ఏరియాలో అక్రమ దందాలు చేసేవారి ఇళ్లల్లో కూడా చిచ్చు పెట్టే ప్రయ త్నం చేశాడు. ఒకట్రెండు చోట్ల ఆ కానిస్టేబుల్‌కు చుక్కెదురైనా.. బెల్ట్‌షాప్ నిర్వాహకుడి భార్య మాత్రం అతని ట్రాప్‌లో పడిపోయింది. ఈ వ్యవహారమంతా తెలిసిన భర్త.. తన భార్యతో గొడవపడ్డాడు. ఒకానొక సందర్భంలో ఆ కానిస్టేబుల్‌పై దాడికూడా చేసి ఇంటివైపుకు రావద్దంటూ వెళ్లగొట్టాడు.
ఇలా అయితే తమ వ్యవహారం కొనసాగదని ఆలోచించిన కానిస్టేబుల్.. బాధితుడిని అతని భార్య టార్గెట్ చేసేలా రెచ్చగొట్టాడు. బెల్ట్‌షాప్ నిర్వాహకుడు ఇంట్లో లేని సమయంలో కానిస్టేబుల్ నేరుగా వారి ఇంటికి వచ్చిపోతుండడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇంటిపై పోలీసులతో దాడులు చేయించి డీవీఆర్ కూడా తీసుకుపోయాడని బాధితుడు వాపోయా డు. అయితే ఈ వ్యవహారమంతా బాగాలేదంటూ గతంలో తమ పరిధికి సంబంధించిన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కానిస్టేబుల్‌ను పిలవకుండానే భార్యాభర్తలను పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారని, ఆ తర్వాత తన ఒత్తిడితో కానిస్టేబుల్‌ను నామమాత్రంగా మందలించారు తప్ప కేసు నమోదు చేయలేదని బాధితుడు చెప్పారు. కొన్ని రోజులకు తన భార్య రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సరిహద్దు గ్రామంలోని తన పుట్టింటికి వెళ్తే అక్కడకు కూడా వెళ్లి ఆమెను కలిసే ప్రయత్నం చేస్తే ఆ ప్రాంత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడి అధికారులు పాతబస్తీలోని తమ ఏరియా పీఎస్‌కు ఫోన్‌చేసి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారని బాధితుడు చెప్పాడు. ఇదంతా ఒక ఎత్తైతే గతవారం తన భార్య ఆ కానిస్టేబుల్‌తో ఉండడాన్ని చూసిన ఇంటర్మీడియట్ చదువుతు న్న తన కూతురు.. తల్లిని నిలదీయడంతో ఇంట్లో గొడవ జరిగిందని బాధితుడు చె ప్పారు.
కానిస్టేబుల్ అరాచకం, తల్లి ప్రవర్తనకు బాధపడిన ఆ అమ్మాయి పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటికి వచ్చిన తండ్రి తన కూతురు పరిస్థితి చూసి ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ఏరియా పోలీసులు ఆరా తీసి అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి కారణమేంటని అడగగా పోలీస్ కానిస్టేబుల్ వ్యవహారమంతా చెప్పానని, కానీ తన భార్య కానిస్టేబుల్‌నే వెనకేసుకొస్తున్నదని, తన కూతురు, తాను చచ్చిపోవాలని పోలీసు ఉన్నతాధికారులకే చెప్పిందని బాధితుడు వాపోయాడు. ఈ వ్యవహారం మొత్తంలో బాధితుడి కుటుంబంలో చిచ్చు పెట్టిన కానిస్టేబుల్‌పై మాత్రం ఇప్పటివరకూ పోలీస్అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితుడు ఆరోపించాడు. తనకు రాయడం రాకపోవడం తో ఫిర్యాదును పోలీసులే టైప్ చేసుకున్నారని బాధితుడు చెప్పారు. అయితే భార్యాభర్తల దగ్గర వేర్వేరుగా ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు ఈ వ్యవహారంలో వారి కూతురు మామూలు స్థితికి వచ్చిన తర్వాత ఆమె వాంగ్మూలంతో ఒక నిర్ణయం తీసుకుని కేసు నమోదు చేస్తామని చెప్పినట్లు స మాచారం. మొత్తానికి టాస్క్‌ఫోర్స్ పేరుతో అరాచకం సృష్టిస్తూ మహిళను లొంగదీసుకుని వారి కుటుంబంలో చిచ్చు పెట్టి ఓ అ మ్మాయి ఆత్మహత్యాయత్నానికి కారణమైన కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా.. లేక బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ పేరుతో వారిని బెదిరించి తమ డిపార్ట్మెంట్ వ్యక్తి ఎంత అరాచకం చేసినా అతనికే మద్దతు పలుకుతారా.. ఈ వ్యవహారంలో సిటీ పోలీస్‌బాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.