ఊట్కూర్ : మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తారు రోడ్డు ( BT Road ) సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari ) అన్నారు. శనివారం నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామం నుంచి కొత్తపల్లి గ్రామానికి రూ. 1 కోటి 90 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం, అవసలోనిపల్లిలో రూ. 20 లక్షల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ పార్టీలకతీతంగా, నియోజక వర్గ అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా తన పదవీకాలం పూర్తయ్యే నాటికి నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామానికి తారు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని, గడువులోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటే అదనంగా మరో 3500 ఇండ్ల మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
బిజ్వారం గ్రామంలో పశు వైద్య కేంద్రం ఏర్పాటు, అవసలోని పల్లిలో 5 ఎకరాల స్థలంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ బిల్డింగ్, వైద్య శాల, ఇతర ప్రభుత్వ నిర్మాణాలను ఒకే దగ్గర చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ మణెమ్మ, తహసీల్దార్ రవి, ఎంపీడీవో ధనుంజయ గౌడ్, పీఆర్ ఈఈ హీర్యానాయక్, డీఈ కళ్యాణ్ రెడ్డి, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి సలీం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి, నాయకులు బసవరాజ్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, లింగం, సత్యనారాయణ రెడ్డి, నాగేష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, అశోక్, వీర రాఘవరెడ్డి, మహమ్మద్ ఖుర్షిద్, తదితరులు పాల్గొన్నారు.