తాండూరు నాపరాతికి ప్రపంచ స్థాయిలో విశిష్టమైన స్థానం లభించింది. తాండూరు నాపరాతికి చలువ గుణం ఉండడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తకపోవడంతో దేశ, విదేశాల్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, మలేషియా, ఇథోపియా, బ్రిటన్, ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ర్టాలకు వివిధ రూపాల్లో కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. దేశంలోని మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి.
తాండూరు, డిసెంబర్ 5 : భవనాల నిర్మాణంలో వాడే తాండూరు నాపరాతికి ప్రపంచ స్థాయిలో విశిష్టమైన స్థానం లభించింది. తాండూరు ప్రాంతంలో శతాబ్దం నుంచి నాపరాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. 1965-70 మధ్యకాలంలో తాండూరు ప్రాంతంలోని నాపరాళ్ల నిల్వలను పూర్తిస్థాయిలో గుర్తించారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ పార్టీ నేతలు నాపరాళ్లకు మార్కెట్లో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి నాపరాతి వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. దీంతో వ్యాపారులు మంచి లాభాలను పొందుతున్నారు. మరో వైపు నాపరాతి పరిశ్రమలపై ఆధారపడి వేలాది మంది కుటుంబాలు జీవిస్తున్నాయి. కాకతీయుల కాలం నుంచే తాండూరు ప్రాంతంలో నాపరాళ్ల వినియోగంతో చారిత్రక కట్టడాలు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిర్మాణమైన దేవాలయాలు, చెరువులు, తూములు, అలుగులు కూడా నాపరాళ్లతోనే నిర్మించడం విశేషం. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కట్టడాలు రాజుల కాలంలో నిర్మించగా నేటి ఆధునిక కాలంలో నాపరాళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో మన దేశానికి విదేశీ మారకద్రవ్యం కూడా లభిస్తుండడం విశేషం. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో తాండూరు ప్రాంత నాపరాయికి భాగస్వామ్యం లభించినట్లయింది.
కంటైనర్ల ద్వారా విదేశాలకు ఎగుమతులు..
తాండూరు ప్రాంతం నుంచి దేశంలోని మహారాష్ట్ర నాగ్‌పూర్, పూణె, ముంబాయి, గోవా, కర్ణాటక, బెంగుళూరు, హుబ్లి, దార్వాడ్, బీదర్, తమిళనాడు సేలం, గుజరాత్, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. అంతే కాకుండా తాండూరు నాపరాయిని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుండడం విశేషం. ముఖ్యంగా యూరోఫ్ దేశాలకు నాపరాయిని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, మలేషియా, ఇథోపియా వంటి దేశాలతో పాటు బ్రిటన్, ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ర్టాలకు కూడా తాండూరు నాపరాయి ఎగుమతి అవుతుండడం విశేషం. తాండూరు ప్రాంతంలోని నాపరాయికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో తాండూరు నుంచి చెన్నై, ముంబై షిప్‌యార్డులకు లారీల్లో నాపరాళ్లను తరలించి అక్కడి నుంచి కంటైనర్ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశాల్లో తాండూరు నాపరాయికి మంచి డిమాండ్ ఉంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా స్విమ్మింగ్‌ఫూల్, ప్రహరీ నిర్మాణంలో నాపరాయి రకరకాలుగా వినియోగిస్తున్నారు. పార్కులు వంటి స్థలాల్లో కూడా తాండూరు నాపరాయిని ఎక్కువగా వాడుతున్నారు. పాలిష్ చేయని నాపరాయిని స్మిమ్మింగ్ఫూల్స్లో వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. గర్కుగా ఉండే పాలిష్ చేయని నాపరాయిపై సంచరించడం చాలా సులువు. వృద్ధులు, వయసు పైబడిన వారు నాపరాళ్ల పలకలు ఫ్లోరింగ్‌కు వినియోగించిన ప్రాంతాల్లో ఏ మాత్రం తత్తర పాటు లేకుండా సంచరించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే విదేశస్తులు గరకుగా ఉండే నాపరాయిని రకరకాల డిజైన్లలో తీర్చిదిద్ది వాడుతున్నారు. తాండూరు పట్టణంలో నాపరాళ్ల పరిశ్రమను నిర్వహించడంలో పేరుగాంచిన కొన్ని ప్రముఖ కంపెనీలు రఫ్ నాపరాయిని పలు డిజైన్లుగా రూపొందించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో మన దేశానికి విదేశీ మారకద్రవ్యం లభిస్తుండడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో తాండూరు ప్రాంత నాపరాయికి భాగస్వామ్యం లభిస్తున్నది.
తాండూరు నాపరాయి ప్రత్యేకత..
ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా తాండూరు నాపరాయి ఉపయోగ పడుతున్నది. ఈ కారణంగానే తాండూరు ప్రాంతంతో పాటు విదేశాల్లో కూడా గృహ నిర్మాణం, భవన నిర్మాణాల్లో ఫ్లోరింగ్ పనులకు ఎక్కువగా తాండూరు నాపరాయిని వినియోగిస్తుండడం విశేషం. ఇక్కడి నాపరాయికి చలువ గుణం ఉన్నది. వయస్సు పైబడిన వారు కూడా నాపరాయితో వేసిన ఫ్లోరింగ్ గదుల్లో నిద్రిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అదే గ్రానైట్ పలకలు వంటివి ఫ్లోరింగ్‌లో వాడితే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు కూడా సూచిస్తుండడం విశేషం. అంతే కాకుండా తాండూరు నాపరాయి మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తోంది. మార్కెట్లో లభిస్తున్న సాధారణ రకం టైల్స్‌తో పోలిస్తే నాలుగో వంతు ధరకే నాపరాళ్లు లభిస్తున్నాయి. చదరపు అడుగు నాపరాయికి పాలిష్ చేసినవి రూ.10 నుంచి రూ.20 ధర ఉంటే అదే సాధారణ రకం టైల్స్ ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉండడం గమనార్హం. ఈ కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నాపరాళ్లను భవన నిర్మాణాల్లో వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాండూరు ప్రాంతంలోని అనేక గ్రామాల్లో పూర్తిగా నాపరాళ్లతోనే ప్రజలు ఇండ్ల నిర్మాణం చేపట్టడం గమనార్హం. తాండూరు ప్రాంతంతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని చించొళ్లి, సేడం, ముధెల్లితో పాటు మహబూబ్‌నగర్, వికారాబాద్ నియోజకవర్గాల్లో నాపరాళ్లతో నిర్మించిన ఇండ్లు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి.
విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది
తాండూరు నాపరాతికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంటుంది. తాండూరులో ప్రత్యేక నాపరాతి కార్మాగారాన్ని ఏర్పాటు చేసి మూప్పై ఏండ్లుగా నాపరాతి వ్యాపారం చేస్తున్నా, భారత దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు ప్రత్యేక అనుమతులతో యూరోఫ్ దేశాలకు నాపరాయిని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నా. ఇటలీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, మలేషియా, ఇథోపియా, బ్రిటన్, ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ర్టాలకు ఆడర్ల ద్వారా తాండూరు నాపరాయిని వివిధ రూపాల్లో ప్యాకింగ్ చేసి కంటైనర్ల ద్వారా విదేశాలకు ఎగుమతులు చేస్తున్నా.
తాండూరు నాపరాతికి ప్రత్యేక గుర్తింపు
ప్రపంచ దేశాల్లో తాండూరు నాపరాతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకు తగ్గట్లు స్థానికంగా లభించే నాపరాతిని వివిధ రూపాల్లో ప్రత్యేక సైజులుగా కటింగ్ చేసి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు దేశాంలోని పలు రాష్ర్టాలకు నాపరాతిని అందిస్తున్నా. తాండూరు నాపరాతికి చలువ గుణం ఉండడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తక పోవడంతో ప్రజలు తాండూరు నాపరాతిని ఎక్కువగా ఇష్టపడుతారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాపరాతి వ్యాపారం సంతోషంగా చేసుకుంటున్నాం.