
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యాసంస్కరణలు గ్రామీణ ప్రాంత పాఠశాలలను బలోపేతం చేస్తున్నాయి. ఇన్నేండ్లు ప్రైవేట్ పాఠశాలల మాయలో పడిన గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే సర్కారుబడి గొప్పతనాన్ని తెలుసుకొని తమ పిల్లలను సర్కారుబడి బాట పట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రుచికరమైన మధ్యాహ్న భోజనం, కార్పొరేట్ విద్యను తలపించే డ్రెస్‌కోడ్, ఆటలు, చదువులు, సిబ్బందికి సుశిక్షణతో బోధన ద్వారా సర్కారు బడులకు కొత్త అందం తెచ్చింది.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బొర్రెగూడెం లాంటి ప్రభుత్వ పాఠశాల్లో నో వెకంట్ అనే బోర్డులు సైతం పెట్టారంటే ప్రభుత్వ బడికి పెరుగుతున్న ఆదరణ అర్థమవుతుంది. మండలంలో 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 33 ప్రాథమిక పాఠశాలలు మరో నాలుగు ప్రైవేట్ పాఠశాలు ఉన్నాయి. కరోనా విపత్తు కారణమైతేనేమి, ప్రైవేట్ బడుల ఫీజుల భారమైతేనేమి గ్రామాల్లో సర్కారు బడులకే సలాం కొడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. సరిగ్గా ఇలాంటి నూతన ఒరవడులతో జాతీయస్థాయి మ్యాగ్జిన్‌లో స్థానం పొందిన శాకారం సర్కారుబడిపై ప్రత్యేక కథనం.
డిజిటల్ బోధనతో చక్కటి ఫలితాలు..
పాఠశాలలో డిజిటల్ బోధన విద్యార్థుల్లో చక్కటి మార్పును తీసుకువచ్చింది. చదువులో వెనకబడిన విద్యార్థులకు డిజిటల్ తరగతులు కలిసొచ్చాయి. సామూహిక బోధనతో విద్యార్థుల మధ్య విషయ పరిజ్ఞానాన్ని పెంచుతున్నాయి. శాకారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇందుకు చక్కటి ఉదాహరణ. పాఠశాల్లో మొత్తం 72 మంది విద్యార్థులు ఉండగా.. ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్ మరో టీచర్ నీరజతో కలిపి ఇద్దరితో 5వ తరగతి వరకు బోధన చేపడుతున్నారు. గోడలపై జాతీయ పక్షులు, వన మృగాలు, ఆహ్లాదాన్ని పెంపొందించే, ఆకర్షనీయమైన చిత్రాలు, ఆరోగ్య నియమాలను సూచించే చార్టర్‌ను గోడలపై ముద్రించడంతో బాల్యవిద్య పరిజ్ఞానానికి బాటలు వేసినైట్లెంది.
శాకారం ప్రభుత్వ పాఠశాల గోడపై వేయించిన చిత్రం ఆ పాఠశాలను జాతీయస్థాయి మ్యాగ్జిన్‌లో స్థానం కల్పించేలా చేసింది. చక్కటి బోధనకు తోడుగా గోడలపై వేయించిన చిత్రాలు కూడా ఎంతో ఆకర్షనీయంగా ఉండటంతో ఎన్సీఈఆర్టీ బృందం దృష్టిలో పడింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రెనింగ్ బృందం పాఠశాలను సందర్శించి అక్కడి విషయాలను అడిగి తెలుసుకున్నది. పాఠశాలలో జరుగుతున్న బోధన తీరు తెన్నులను రైస్ అండ్ షైన్ నేషనల్ మ్యాగ్జిన్‌లో ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పాత్ర తదితర 67 అంశాలను పరిగణలోకి తీసుకోగా.. శాకారం ప్రభుత్వ పాఠశాల గోడపై వేయించిన తనచదువే.. తన ఎదుగుదలకు రెక్కలు అనే ఎనమిల్ పెయింట్ చిత్రానికి జాతీయస్థాయి మ్యాగ్జిన్‌లో చేరేటట్టు చేసింది. ఓ బాలిక స్కూల్ పుస్తాకాలను రెక్కలుగా చేసుకొని ఎగురుతున్నట్లుగా దీని అర్థం మ్యాగ్జిన్‌లో బ్యాక్‌పేజీకి ఈ బొమ్మనే వేసుకోవడం శాకారం ప్రభుత్వ పాఠశాలకు దక్కిన గౌరవం.
చాలా సంతోషంగా ఉన్నది..
మా పాఠశాలకు జాతీయస్థాయి మ్యాగ్జిన్‌లో చోటు దక్కడం మరువలేని సంఘటన. 5 తరగతులుండగా, మొత్తం 71 మంది విద్యార్థులున్నారు. ఆంగ్ల మాద్యమంలోనే బోధన చేపడుతున్నాం. చదువుల్లో వెనకబడిన ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే మా పాఠశాలలో కూడా గోడపై వివిధ రకాల చిత్రాలను వేయించాం. ప్రత్యేకంగా ఎనమిల్ పెయింట్‌తో వేయించిన బాలిక చిత్రానికి ఇంతటి ఆదరణ వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది.