లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) 5వ వార్షికోత్సవ సమావేశాన్ని లండన్లో ఘనంగా నిర్వహించారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టాక్ కార్యవర్గ సభ్యులంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ..సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంతో కృషి చేసి విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కార్యవర్గసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే సహకరించి ప్రోత్సహిస్తున్న స్థానిక ప్రవాసులకు, ప్రవాస సంస్థలకు, స్థానిక యూకే రాజకీయ నాయకులకు, ప్రభుత్వ సంస్థలకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ నాయకులకు, మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు, శ్రేయోభిలాషులకు రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మొదటి నుంచి సహకరిస్తున్న ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
టాక్ కార్యవర్గ సభ్యుల నిర్విరామ కృషి వల్లే నేడు సమాజ సేవలో 5 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకొని, అదే నిబద్ధతతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఇటీవల బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ టాక్ సంస్థను అభినందించడం మనందరికీ గర్వకారణమన్నారు.
బతుకమ్మ వేడుకల్లో జరిగిన విశేషాలని మహారాణి దృష్టికి తీసుకెళ్లిన చిరంజీవి నిత్యశ్రీ కూర్మాచలంని, అలాగే బతుకమ్మ వేడుకల్లో విన్నూతంగా లండన్ టవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు కృషి చేసిన మల్లా రెడ్డి – శుష్మణ రెడ్డి దంపతులని రత్నాకర్ కడుదుల ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వం కొవిడ్ – 19 నిబంధనలను సడలిస్తున్నందున, ఈ సంవత్సరం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందనే ఆలోచనతో టాక్ – 2022 ఈవెంట్స్ క్యాలెండర్ ని టాక్ కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు.
టాక్ కమ్యూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. టాక్ సంస్థ కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఇటు క్రీడా, సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
సంస్థలో భాగస్వాములయ్యే వారు tauk.org@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించాలని లేదా www.tauk.org.uk వెబ్ సైట్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని నవీన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో హాజరైన టాక్ కార్యవర్గసభ్యులు కేక్ కట్ చేసి 5 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సమావేశంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల , ఉపాధ్యక్షులు శుష్మున రెడ్డి, సత్య చిలుముల, కన్వీనర్ అశోక్ కుమార్ దూసరి, ఇతర నాయకులు నవీన్ రెడ్డి,జాహ్నవి, మల్లా రెడ్డి, ప్రవీణ్ కుమార్ వీర,సెరు సంజయ్, రవి రెటినేని, సుప్రజ, సత్యపాల్, శ్రీకాంత్ జెల్ల, హరిబాబు,శ్రీ విద్య, రాజేష్ వర్మ, అవినాష్, నవీన్ కుమార్, రంజిత్, క్రాంతి, శ్రీ శ్రావ్య ,శైలజ ,వంశీ, పృథ్వీ,శశిధర్ తదితరులు పాల్గొన్నారు.