Fiber Foods | చాలా మంది తీసుకునే ఆహారంలో ఫైబర్ తప్పకుండా ఉండాలని, ఫైబర్ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ఫైబర్‌ను జీర్ణక్రియకు మేలు చేసే పోషకంగా భావిస్తారు. అయితే తాజా పరిశోధనలు ఫైబర్ మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి. దీంతో ఆహార అలవాట్లపై కొత్త దృష్టికోణం ఏర్పడుతోంది. ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఫైబర్ అధికంగా తీసుకునే వ్యక్తుల్లో డిమెన్షియా ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం కనిపించిందని వెల్లడైంది. సుమారు 3,700 మందిపై నిర్వహించిన పరిశోధనలో, ఎక్కువ ఫైబర్ తీసుకున్నవారిలో మతిమరుపు సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 60 ఏళ్లకు పైబడిన వారిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫైబర్ మెదడుపై ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలంటే గట్-బ్రెయిన్ యాక్సిస్ అనే భావనను తెలుసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థ, మెదడు మధ్య జరిగే ద్విముఖ కమ్యూనికేషన్ వ్యవస్థ. పొట్టలో లక్షల కోట్ల బ్యాక్టీరియా నివసిస్తాయి. వీటినే గట్ మైక్రోబయోమ్ గా పిలుస్తారు. ఇవి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా దాన్ని ఫెర్మెంట్ చేసి షార్ట్-చైన్ ఫ్యాటీ ఆసిడ్స్’ (SCFAs) అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, మనసు స్థితిని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సులభంగా చెప్పాలంటే, తినే ఆహారం మెదడు పనితీరుపై నేరుగా ప్రభావం చూపుతుంది.
ఈ అధ్యయనాల ప్రకారం, ఫైబర్ అధికంగా తీసుకునే వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడటం, దృష్టి కేంద్రీకరణ పెరగడం, వయస్సుతో వచ్చే మెదడు క్షీణత ప్రమాదం తగ్గడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. అలాగే ఆల్జీమర్స్ వంటి న్యూరో డిజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి, అయితే దీనిపై ఇంకా మరిన్ని అధ్యయనాలు అవసరం.ఫైబర్ మెదడుకు మేలు చేసే ప్రధాన కారణాల్లో ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గించడం ఒకటి. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ అనేక మెదడు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అలాగే గట్ బ్యాక్టీరియా సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీన్ని ఫీల్-గుడ్ హార్మోన్‌గా పరిగణిస్తారు.
ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆకస్మికంగా షుగర్ పెరగడం లేదా పడిపోవడం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా చేసి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, 10 ఏళ్లు పైబడినవారు రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం చాలా మంది ప్రాసెస్డ్ ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. భారతీయ వంటకాలలోనే పప్పులు, ధాన్యాలు, కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు సులభంగా లభిస్తాయి. అయితే ఒక్కసారిగా ఫైబర్‌ను అధికంగా తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యం కలుగుతాయి. కాబట్టి ఫైబర్‌ను మెల్లగా పెంచుతూ, తగినంత నీరు తాగడం అవసరం.
మెదడు ఆరోగ్యంతో పాటు ఫైబర్ అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకాన్ని నివారించడం, బరువును నియంత్రించడం, కొలెస్ట్రాల్ తగ్గించడం, టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలు అందిస్తుంది. ఫైబర్ కేవలం జీర్ణక్రియకే కాకుండా మెదడు ఆరోగ్యానికి కూడా కీలకమని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రతిరోజూ ఆహారంలో ఫైబర్‌ను చేర్చడం ద్వారా జ్ఞాపకశక్తి, దృష్టి, మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశముందని నిపుణులు తెలియజేస్తున్నారు.