Peddi |టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ విడుదల తేదీ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. మొదటగా ఈ సినిమాను మార్చి 17న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల ఆ తేదీని ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఆ సమయంలో కూడా అభిమానులు పెద్దగా నిరాశ చెందకుండా “ఒక నెల ఆలస్యమే కదా” అంటూ ఓపిక పట్టారు. కానీ విడుదలకు దగ్గరపడుతున్న సమయంలో మళ్లీ సినిమాను జూన్‌కు పోస్ట్‌పోన్ అవుతుందని ప్రచారం జరగడంతో మెగా అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
ఇక తాజాగా ఈ అనిశ్చితికి తెరదించుతూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘పెద్ది’ సినిమాను జూన్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, అదే రోజున విడుదల కావాల్సిన ‘టాక్సిక్’ సినిమా ఆగస్టుకు వాయిదా పడటంతో ఆ స్లాట్‌ను ‘పెద్ది’ టీమ్ స్మార్ట్‌గా బుక్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్, ఫస్ట్ షాట్ విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పీక్స్‌కు చేరుకుంది. దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ సినిమాలో చరణ్‌ను పూర్తిగా కొత్తగా, రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో చూపిస్తున్నాడు.
సినిమా నుంచి విడుదలైన ‘చికిరీ’ సాంగ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. మొదట్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, తరువాత అదే పాట మిలియన్ల వ్యూస్ దక్కించుకొని, సోషల్ మీడియాలో లక్షల రీల్స్‌తో వైరల్ అయింది. అలాగే ‘రై రై రారా’ పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘ఉప్పెన’ సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బుచ్చి బాబు సనా, ఈ సినిమాతో మరింత భారీ హిట్ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా, కథలో భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్‌కు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ఇక నటీనటుల విషయానికి వస్తే, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ అందిస్తుండటంతో ఆల్బమ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు వాయిదాలు పడ్డా, చివరకు జూన్ 4కు ఫిక్స్ అయిన ‘పెద్ది’ సినిమా మెగా అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వబోతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీస్ రికార్డులపైనే ఉంది.