హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్ట హెడ్‌వర్క్స్‌ను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ పరిధి నుంచి తొలగించి, రివర్ బోర్డు పరిధిలో చేర్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) తెలంగాణ సర్కారు సూచించింది. ఆర్డీఎస్ ఆనకట్ట, కాలువ ఆధునికీకరణ పనులను కూడా పూర్తిచేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ సోమవారం లేఖ రాశారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ మొత్తం పొడవు 143 కిలోమీటర్లు కాగా 42.60 కిలోమీటర్లు మాత్రమే కర్ణాటకలో ఉండగా మిగతా భాగం తెలంగాణ, ఏపీలోనే ఉన్నదని వివరించారు. ఈ కాలువ ద్వారా తెలంగాణలో 87,500 ఎకరాలకు, కర్ణాటకలో కేవలం 5,879 ఎకరాలకు సాగునీటి కేటాయింపులు ఉన్నాయని తెలిపారు.కర్ణాటక కంటే తెలంగాణ, ఏపీకే ఎక్కువ నీటి కేటాయింపులు ఉన్నందున హెడవర్క్స్ మొత్తాన్ని కేఆర్ఎంబీ పరిధిలో చేర్చాలని కోరారు. 850 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన ఆర్డీఎస్ కాలువ హెడ్వర్స్స్ ప్రస్తుత సామర్థ్యం 400 క్యూసెక్కుల కంటే దిగువకు పడిపోయిందని, దీంతో తెలంగాణకు సాగునీరు అందని పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం కూడా 15.90 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు దిగజారిందని వివరించారు. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు 2005లోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 115 జీవోను విడుదల చేసిందని గుర్తుచేశారు. ఇందుకు అవసరమయ్యే నిధులను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినట్టు వెల్లడించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు కర్ణాటక ప్రభుత్వం మిగిలిన పనులను చేపట్టడం లేదని పేర్కొన్నారు. కేసీ కెనాల్‌కు అక్రమంగా నీటిని తరలించుకొనిపోవాలనే ఉద్దేశంతోనే ఏపీ సర్కారు ఆ విధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఆర్డీఎస్ ఆనకట్ట, కాలువ ఆధునికీకరణ పనులను వెంటనే పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.