Taapsee Pannu | బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాధారణంగా తన ప్రేమ, కుటుంబ విషయాలను పెద్దగా బయటకు చెప్పని ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి, సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో తన అనుబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే మథియాస్ బోతో తాను డేటింగ్ ప్రారంభించినట్లు తాప్సీ వెల్లడించారు. జీవితంలో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో మథియాస్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ఒకటని ఆమె పేర్కొన్నారు. కుటుంబం, వృత్తి వంటి కొన్ని విషయాలు జీవితంలో అనుకోకుండా వచ్చినప్పటికీ.. మథియాస్‌ను ఎంచుకోవడం మాత్రం పూర్తిగా తన సొంత నిర్ణయమని స్పష్టం చేశారు.
మథియాస్‌తో తన బంధం గురించి మాట్లాడుతూ.. ఆయనను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తాప్సీ అన్నారు. తమ ప్రయాణం 13 ఏళ్లుగా కొనసాగుతోందని వెల్లడించారు. ఇన్నేళ్లుగా తమ బంధంలో ఎంతో భద్రత, స్థిరత్వం ఉన్నాయని చెప్పారు. తమ మధ్య ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవమే ఈ బంధానికి ప్రధాన బలమని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక బంధం ఎక్కువ కాలం కొనసాగాలంటే పరస్పర గౌరవం చాలా ముఖ్యమని తాప్సీ అన్నారు. ప్రేమ ఒక్కటే సరిపోదని.. ఒకరినొకరు గౌరవించుకునే స్వభావం లేకపోతే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలవడం కష్టమని ఆమె పేర్కొన్నారు. మథియాస్‌తో తన అనుబంధంలో ఆ గౌరవం మొదటి నుంచే ఉందని చెప్పుకొచ్చారు.
తాప్సీ, మథియాస్ బో 2024లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహానికి ముందు కూడా వీరిద్దరూ చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచేందుకు ఈ జంట ఎక్కువగా ప్రయత్నించింది. ఇప్పుడు తాప్సీ స్వయంగా తమ బంధం గురించి మాట్లాడటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.ఇక తాప్సీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. విడుదలైన తొలి మూడు వారాల్లో ఈ చిత్రానికి 18.9 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాప్సీకి ‘హార్పర్స్ బజార్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – 2026’ పురస్కారం కూడా లభించింది.ఈ అవార్డు అందుకున్న సందర్భంగా తాప్సీ తన తోటి నటీమణులకు, ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.