Wimbledon : వింబుల్డన్‌లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ (Iga Swiatek)కు ఊహించని షాక్ తగిలింది. శనివారం జరిగిన మూడో రౌండ్లో 32వ ర్యాంకర్ అలెగ్జాండ్ర ఈలా(ఫిలీప్పీన్స్) చేతిలో మాజీ విజేత కంగుతిన్నది. ఫేవరెట్‌గా గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టిన ఆమెకు అలెగ్జాండ్ర నుంచి గట్టిపోటీ ఎదురైంది. వరస సెట్లలో నిరాశపరిచిన మూడో ర్యాంకర్ ఉసూరుమంటూ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియాటెక్ పోరాటం ముగిసింది. సెంటర్ కోర్టులో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పొలాండ్ స్టార్‌ను అలెగ్జాండ్ర ఈలా చిత్తు చేసింది. రెండు గంటల 15 నిమిషాల పాటు సాగిన మారథాన్ పోరులో 20 ఏళ్ల అలెగ్జాండ్ర ధాటికి స్వియాటెక్ చేతులెత్తేసింది.
A moment Alex Eala will never forget. #Wimbledon pic.twitter.com/2tGGkmzNC1
— Wimbledon (@Wimbledon) July 4, 2026
తొలిసెట్లో మెరుగ్గా ఆడినా 7-6(9), 6-2తో మ్యాచ్ చేజార్చుకుందీ మాజీ ఛాంపియన్. అలెగ్జాండ్ర చేతిలో స్వియాటెక్‌కు ఇది రెండో ఓటమి. 2025లో ఇంటర్ మియామి ఓపెన్‌లో విజయం సాధించిన ఫిలీప్పీన్స్ ఈసారి గ్రాస్ కోర్టుపైనా తన ఆధిపత్యం చెలాయించింది.
‘ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియడం లేదు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇది నాకు రెండో వారం. ఇది చాలా అద్భుతమైన ఫీలింగ్. స్వియాటెక్ గొప్ప క్రీడాకారిణి, అద్భుతమైన మనిషి. వింబుల్డన్‌లో ఆమెతో సెంటర్ కోర్టులో ఆడడం నిజంగా గొప్ప గౌరవం’ అని మ్యాచ్ అనంతరం అలెగ్జాండ్ర తెలిపింది.