హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ యారా రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ తిరుమలాదేవి, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ వారితో ప్రమాణం చేయించారు. వీరంతా 2025 జనవరి 25న అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారి కుటుంబసభ్యులు, న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మ న్ ఏ నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ పీ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, న్యాయాధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు.