పెద్దఅడిశర్లపల్లి ఏప్రిల్ 2 : ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నుంచి విద్యుత్ మోటర్ల ద్వారా సాగు చేసుంటున్న రైతులకు అధికారులు మంగళవారం నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. తాగునీటి అవసరాలకు ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మోటర్లు రన్ చేస్తే చివరి వరకు నీరు చేరదని ఉన్నతాధికారుల అదేశాల మేరకు ట్రాన్ఫార్మర్లకు జంపర్లు కట్ చేస్తున్నారు. మధ్యాహ్నంలోగా జంపర్లు కట్ చేసి ఒక్క వ్యవసాయ మోటరు కూడా నడవకూడదని దేవరకొండ ఏడీఏ సీరియస్ అదేశాలు జారీ చేశారు. దాంతో విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగారు. అక్కంపల్లి, రంగారెడ్డిగూడెం, దుగ్యాల, పీఏపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపి వేశారు. మండలంలోని పుట్టంగండి నుంచి ఏకేబీఆర్ వరకు ఉన్న అనుసంధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీ -7 ఆయకట్టుకు మొదటి నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేస్తుడడంతో రైతులు కాల్వ నీటిపై ఆధారపడి వరినాట్లు వేశారు. చివరికి పంట పొట్టకు వచ్చే దశలో విద్యుత్ అధికారులు వ్యవసాయ మోటర్లకు నీటి సరఫరా నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మం గళవారం డిస్ట్రిబ్యూటరీ -7 పరిధిలోని రాంపురం, పీఏపల్లి, దుగ్యాల శివారులో ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ ఏఈ కావ్య ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్లకు జంపర్లు తొలగించారు. మరో పదిహేను రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో కరెంట్ నిలిపివేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ట్రాన్స్ఫార్మర్లపై కాల్వ మోటర్లు కాకుండా బోర్ల కనెక్షన్లు ఉండడంతో బోర్లకు కూడా కరెంట్ సరఫరా ఉండడం లేదని రైతులు వాపోతున్నారు.
900 క్యూసెక్కులు విడుదల
జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం ఉదయం సముద్రాన్ని నింపేందుకు ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు మంగళవారం నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఇందుకోసం రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద గేట్లు ఎత్తివేశారు. 900 క్యూసెక్కులు ప్రధాన కాల్వకు విడుదల చేయగా ప్రస్తుతం ఏఎమ్మార్పీ నుంచి మూడు మోటర్ల ద్వారా 1350 క్యూసెక్కులు వస్తున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల లేకుండా నేరుగా ఉదయ సముద్రాన్ని పది రోజుల పాటు నింపనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా నీటిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం గణనీయంగా తగ్గుతున్న నేఫథ్యంలో ఏఎమ్మార్పీ నుంచి కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని అధికారులు చెబుతున్నారు.