వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల శిక్షణలో మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, అక్టోబర్ 30 : రైతులకు లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులకు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఏర్పాటు చేసిన శిక్షణలో మాట్లాడారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను క్లస్టర్ల వారీగా రైతులకు వివరించి పంట మార్పిడిపై చైతన్యం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అనుబంధ శాఖలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వానకాలం మరో 3 కోట్ల మెట్రిక్ టన్నులు దిగుమతయ్యే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో భూమి సాగు విస్తీర్ణం పెరిగిందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంజాబ్ రాష్ట్రంలో ఒకే పంటను సాగు చేయరని, పంట మార్పిడితో భూమికి బలం చేకూరుతుందని చెప్పారు. శిక్షణ పొందిన వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, టెక్నికల్ సిబ్బంది రైతు వేదికల్లో సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్, వ్యవసాయాధికారి రామారావునాయక్, ఏడీఏలు సంధ్యారాణి, జగ్గూనాయక్, శాస్త్రవేత్తలు భరత్, నరేశ్, కిరణ్, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.