సూర్యాపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయం, పంటల సాగు విషయంలో రైతులు ఆలోచనలో పడ్డారు. ఓ వైపు ప్రభుత్వం వరికి బదులు డిమాండ్ ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తుండగా.. ఎవరెన్ని చెప్పినా వరే వేసుకోవాలని కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్న పరిస్థితి. వాస్తవానికి సాగు విషయంలో ఏ పంటపై నిషేధం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యాన్ని తీసుకోబోమని ఎఫ్‌సీఐ లిఖిత పూర్వకంగా తేల్చి చెప్పడం వల్ల యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు, విద్యుత్, పంట పెట్టుబడి సాయం.. ఇలా అన్నీ సమకూర్చి వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్న తరుణంలో విపక్షాల వైఖరి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటల సాగే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలకు మాత్రమే నీరు విడుదల చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులను దాటుకుని..
సమైక్య పాలనలో సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కక తప్పని పరిస్థితి. పోరాటాలు లేకుండా ఏనాడూ ఎరువులు, విత్తనాలు దొరకలేదు. కానీ, టీఆర్ఎస్ పాలనలో ఆ అవసరం లేకుండానే రైతులకు అన్నీ సమకూరుతున్నాయి. సమయానికి సాగునీరు, నిరంతర విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయి. పైగా సీజన్‌కు ముందే పంట పెట్టుబడి ఎకరానికి ఏటా 10వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నది. దాంతో వ్యవసాయం పండుగలా మారి రైతులు సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. భూముల ధరలకూ రెక్కలొచ్చాయి. ఇలాంటి తరుణంలో రాజకీయ పక్షాల భిన్న వాదనలు వారిని ఆలోచనలో పడేస్తున్నాయి.
కేంద్రం బియ్యం తీసుకోబోమన్నది నిజం కాదా..?
‘జిల్లా రైతాంగానికి కంది, పెసర, ఆముదాలు, ఆవాలు.. ఇలా అన్ని రకాల పంటలు సాగు చేసిన అనుభవం ఉన్నది. అలాంటి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుంది.. అసలు వరి సాగు నిషేధం అని ఎవరన్నారు..? ఒకవేళ వ్యాపారులతో ఒప్పందం కుదర్చుకున్నా… ఏదైనా విత్తన కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నా… మార్కెట్లో డిమాండ్ ఉంటుందని సన్నాలు వేసుకుంటామంటే ఎవరైనా అడ్డుకుంటారా..? ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సీఐ మాత్రమే కొనుగోలు చేస్తది… అలాంటి రకం ధాన్యం పండిస్తే ఎవరు కొనాలి..? వచ్చే యాసంగి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయమని ఎఫ్‌సీఐ లిఖిత పూర్వకంగా ఇచ్చింది… దీనికి కేంద్రంలోని బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు సమాధానం చెప్పి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయాలి… నిజంగా దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేయించాలి. రైతాంగాన్ని నట్టేట ముంచేలా కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై చైతన్యం తీసుకురావాలి’
మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలివి కేంద్రం తీరుతో ఆందోళన..
ఓ వైపు కొత్త వ్యవసాయ చట్టాలు.. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు.. వెరసి కేంద్ర ప్రభుత్వ వైఖరితో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ.. తెలంగాణలో యాసంగి నుంచి బియ్యం సేకరణ ఉండదని లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే మేలని రైతులకు సూచిస్తున్నది. బీజేపీ నాయకులకు రైతులపై ప్రేమ ఉంటే నిరసనలు, దీక్షలు మానుకుని కేంద్రం నుంచి బియ్యం సేకరణకు సానుకూల ప్రకటన ఇప్పించాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రైతులు వాస్తవ పరిస్థితులను గుర్తించాలి..
బియ్యం కొనేది లేదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో వరి సాగు ప్రశ్నార్థకమైంది. యాసంగిలో వరి సాగు చేస్తే అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తున్నది. జిల్లాలో అన్నిరకాల పంటల సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నందున రైతులు మంచి ఆదాయాన్నిచ్చే పంటలు ఎంచుకోవాలని చెప్తున్నది.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తేనే మేలు
యాసంగిలో వరి పండిస్తే ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా వరికి బదులు ఇతర పంటలను సాగు చేసుకోవడమే మేలు. ఒక ఎకరం వరి పండించే నీటితో సుమారు 3- 5 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చు. ఏటా వరి మాత్రమే సాగు చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి సాగు చేస్తే ప్రత్యామ్నాయ పంటల ద్వారా సాగు ఖర్చు తగ్గడంతో పాటు ఎక్కువ ఆదాయం పొందవచ్చు. పప్పుధాన్యాలను సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. దీంతో తదుపరి సాగు చేసే పంట ద్వారా మంచి దిగుబడి, ఆదాయం పొందవచ్చు.
నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసుకోవాలి
రైతులు నేల స్వభావాన్ని బట్టి పంటలను సాగు చేసుకోవాలి. సాధారణంగా నీటి సౌకర్యం కలిగిన ఎర్రనేలల్లో వేరుశనగ, ఆముదం, పెసర, మినుములు, కుసుమ, నువ్వులు, జొన్న, పొద్దు తిరుగుడు సాగు చేసుకోవాలి. నీటి సౌకర్యం కలిగిన నల్లరేగడి నేలల్లో ఆముదం, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, పెసర, మినుము, నువ్వులు సాగు చేసుకుంటే మేలు. వర్షాధార ఎర్రనేలల్లో ఉలవలు, జొన్నలు, వర్షాధార నల్లలరేగడి నేల్లో శనగ, ఆవాలను సాగు చేసుకోవాలి. వరిని అనేక సంవత్సరాలు సాగు చేయడం వల్ల నేల సారం తగ్గిపోతుంది.