సూర్యాపేట అర్బన్, అక్టోబర్ 24 : కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి నవంబర్ 3 వరకు పరీక్షలు జరుగనుండగా జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ విద్య అభ్యసిస్తున్న 9,177 మంది విద్యార్థ్ధులు హాజరుకానున్నారు. వీరిలో 4641 మంది బాలురు, 4536 మంది బాలికలు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 8 గంటల 30 నిమిషాల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జిల్లా వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రతి సెంటర్‌కు ఓ సూపరింటెండెంట్‌ను నియమించారు. వీరితోపాటు మరో 44 మందిని డిపార్ట్మెంటల్ అధికారులు, ఇద్దరు ఫ్లయింగ్ స్వాడ్లు, ముగ్గురు సిట్టింగ్ స్కాడ్లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. జిల్లా కేంద్రంలోని గౌతమి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జానపాటి కృష్ణయ్య ఆదివారం పరిశీలించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సంబంధిత అధికారులు వారికి కేటాయించిన కేంద్రాల్లో హాల్ టికెట్ నెంబర్లు వేసి పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థ్ధులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థ్ధులు కొవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్క్, శానిటైజ ర్లు ఉపయోగిస్తూ పరీక్షలకు హాజరుకావాలి.
-జానపాటి కృష్ణయ్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి