హాలియా, నవంబర్ 17 : హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే నోముల భగత్ కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నారు. కానీ కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని వార్డుల్లో పారిశుధ్య సమస్య నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటలో రోడ్డుపైనే మట్టి, రాళ్ల కుప్పలు పోసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది తమ ఇండ్ల ఎదుట రోడ్డుపైనే మట్టి, రాళ్ల కుప్పలు వేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చిన్నారులు, వృద్ధులు ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. వర్షం వచ్చినప్పుడు మట్టి మురుగు కాల్వల్లోకి చేరి నీరు ముందుకు పారక దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లమధ్యనే మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద అధికమైందని స్థానికులు పేర్కొంటున్నారు. విషయాన్ని సిబ్బందికి తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
మట్టి కుప్పలను తొలగిస్తాం
హాలియా మున్సిపాలిటీకి గతంలో ఒక్కటే ట్రాక్టర్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం మరో రెండు ట్రాక్టర్లను సమకూర్చుకున్నాం. మూడు, నాలుగు రోజుల్లో మట్టి కుప్పలను తొలగిస్తాం. రోడ్డుపై రాళ్లకుప్పలు పోసిన వారికి సమాచారం ఇచ్చాం. వారం రోజుల్లో తొలగించక పోతే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం.