శాలిగౌరారం, నవంబర్ 17 : మండల ప్రజల దశాబ్దాల కల నిజం కాబోతున్నది. కలలో ఊహించని విధంగా గురజాల-మానాయికుంట బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జిలు, రహదారులపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించి నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగానే మండలంలోని గురజాల-మానాయికుంట గ్రామాల మధ్య ఉన్న మూసీ ఏటిపై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మండల ప్రజలు మానాయికుంట, తిరుమలగిరి, తుంగతుర్తి, అడ్డగూడూరు, మోత్కూర్ తదితర గ్రామాలకు వెళ్లాలంటే మూసీ ఏటి నీళ్లలోంచి పోవాల్సి వచ్చేది. ఏరు దాటి అవతల గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఎన్నికల సమయంలో అలాంటి సంఘటనలు కళ్లారా చూసిన ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ వెంటనే మూసీలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం పునఃపరిశీలించి 2017న బ్రిడ్జి నిర్మాణానికి రూ.18కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 20 పిల్లర్లకు గాను 20పూర్తి కాగా స్లాబ్ సైతం పోశారు. రెండు పిల్లర్లకు మాత్రమే స్లాబ్ పోయాల్సి ఉంది. ప్రస్తుతం ఏరు ప్రవహిస్తుండడంతో బ్రిడ్జి పై నుంచే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
నాలుగు జిల్లాలకు అనుసంధానం..
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నల్లగొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రిభువనగిరి జిల్లాలోని వందల సంఖ్యలో గ్రామాలను కలపనుంది. ఇప్పటి వరకు వర్షాకాలం మూసీ ప్రవహిస్తున్న క్రమంలో నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి, తిరుమలగిరి వెళ్లాలంటే మండల ప్రజలు నకిరేకల్, సూర్యాపేట, అర్వపల్లి మండలాల మీదుగా సుమారు 30కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతుండడంతో బ్రిడ్జిపై నుంచే ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రజల కష్టాలను చూసి చలించిపోయా
2014లో ప్రచారం చేసే సమయంలో ఏటిలోంచి నడుచుకుంటూ పోయే ప్రజల కష్టాలను చూసి విస్మయానికి గురయ్యా. అధికారంలోకి రాగానే బ్రిడ్డి నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చా. 2017లోనే సీఎం కేసీఆర్‌ను ఒప్పించి బ్రిడ్జి నిర్మాణానికి శిలాఫలకం వేయించా. ప్రస్తుతం బిడ్జి నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం.
మా ఇబ్బందులు తీరినట్టే
గతంలో వర్షం వస్తే ఏటి అవతల గ్రామాలకు పోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడే వాళ్లం. తెలంగాణ సర్కార్ ఏటిపై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలోని పాలకులకు ఎన్ని వినతులు ఇచ్చినా నీటిలో పోసినట్లయింది. పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సార్ హామీ మేరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో సంతోషంగా ఉంది.
ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ కృషితోనే
ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ కృషితోనే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. గతంలో వర్షం వస్తే ఏరు దాటాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్లం. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి వెళ్లాలంటే 30కిలోమీర్ల దూరం ప్రయాణం చేసి నరక యాతన పడాల్సి వచ్చేది. ప్రస్తుతం మూసీలో బ్రిడ్జి నిర్మాణం పూర్తయి స్లాబ్ పోయడంతో బ్రిడ్జిపై నుంచే తాత్కాలికంగా రాకపోకలు సాగిస్తున్నాం. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌కు కృతజ్ఞతలు.
-గుండా శ్రీనివాస్, సర్పంచ్, గురజాల