గుండాల, నవంబర్ 16 : గుండాల చేనేత సహకార సంఘం రకరకాల వస్ర్తాలను ఎగుమతి చేస్తూ అభివృద్ధి బాటలో నడుస్తున్నది. మండలంలోని వివిధ గ్రామాల చేనేత కార్మికులు గుండాల చేనేత సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారు. 1993లో 350 మందితో ప్రారంభమై నేడు 400 మంది కార్మికులతో ముందుకు వెళ్తున్నది. మొత్తం 80 మగ్గాల మీద కార్మికులు పని చేస్తున్నారు. ఈ సంఘం ఆధ్వర్యంలో టవళ్లు, దోవతులు, దోమతెరలు, బెడ్షీట్లు, లుంగీలు, టీసీ సెట్టింగ్, చీరెలు తదితర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన వస్ర్తాలను టెస్కోకు ఎగుమతి చేస్తున్నారు. సంఘం వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా హోల్సేల్, రిటైల్ పద్ధతుల్లో సైతం విక్రయించి లాభాలు ఆర్జిస్తూ ముందుకు సాగుతున్నారు. 400 మంది కార్మికులు రూ.4 లక్షల వాటా కలిగి ఉన్నారు. కార్మికులతోపాటు పరోక్షంగా వారి వారి కుటుంబాల్లోని మహిళలకు సైతం ఉపాధి లభిస్తుంది. సుమారుగా రూ.2 కోట్ల లావాదేవీలతో సంఘం అభివృద్ధిపథంలో పయనిస్తున్నది.