తుర్కపల్లి, నవంబర్16 : దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికంగా బలపడాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, పశుసంవర్ధక శాఖ జేడీ కృష్ణ అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో మంగళవారం దళితబంధు లబ్ధిదారులు జెర్రిపోతుల ప్రియాంక, జెర్రిపోతుల భాగ్యమ్మకు మంజూరైన పౌల్ట్రీ ఫామ్ పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. అంతకు ముందు గ్రామంలోని ఎస్సీ హాస్టల్ భవనంలో పౌల్ట్రీ, పాడిపరిశ్రమ లబ్ధిదారులతో యూనిట్ల నిర్వాహణపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు ఉన్నతిని సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలువాలన్నారు. గతంలో 10 మందికి గూడ్స్ ట్రాలీలు, డోజర్ ట్రాక్టర్లు, ట్యాగో ఆటోలు పంపిణీ చేశారు. ప్రస్తుతం మరో 10 మందికి పౌల్ట్రీ పరిశ్రమలు మంజూరు కాగా, అందులో జెర్రిపోతుల భాగ్యమ్మ, జెర్రిపోతుల ప్రియాంక పౌల్ట్రీ ఫామ్ షెడ్ల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. మిగిలిన 8మంది త్వరలోనే పౌల్ట్రీఫామ్ నిర్మాణం చేపట్టనున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎస్సీ కార్పొరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రవణ్‌కుమార్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్‌రావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఓనర్‌ను అవుతున్నందుకు సంతోషంగా ఉంది
నేను గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా, నాభర్త బాలనర్సింహ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాం. దళితబంధు పథకం కింద సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన రూ.10లక్షలతో మాకు ఉన్న ఎకరం భూమిలో పౌల్ట్రీఫామ్ షెడ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. పౌల్ట్రీఫామ్‌కు ఓనరును అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ సార్ మాపాలిట దేవుడు.
-జెర్రిపోతుల భాగ్యమ్మ,
దళితబంధు లబ్ధిదారురాలు సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం
గతంలో దళితులను ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మా కష్టం తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ దళితబంధుతో ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు నాభర్త యాదగిరి కూలి పని చేసుకుంటూ చాలీచాలని సంపాదనతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు దళితబంధు నిధులతో గ్రామంలో ఉన్న ఎకరం భూమిలో పౌల్ట్రీఫామ్ షెడ్ ఏర్పాటు చేసుకుంటున్నాం.
-జెర్రిపోతుల ప్రియాంక, దళిబంధు లబ్ధిదారురాలు