దేశవ్యాప్తంగా అవసరానికి మించి వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. బియ్యం నిల్వలు పెరిగిపోయి డిమాండ్‌కు మించి సరఫరా ఉండడంతో మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు మూస ధోరణి వీడి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.
సాధారణంగా మన రైతులు పత్తి, కంది వర్షాధార పంటలుగా సాగు చేస్తారు. అదే విధంగా కందిని అంతర పంటగానూ పండిస్తారు. ఆ రెండు పంటలను నీటి వసతి కలిగిన భూముల్లో పూర్తి స్థాయిలో సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తి అవుతుంది. వర్షాధార పద్ధతిలో పత్తి సాగు చేస్తే ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుంది. అదే నీటి పారకంతో సాగు చేస్తే ఎకరాకు 15-20 క్వింటాళ్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. కంది పంట సైతం వర్షాధార పద్ధతిలో 4-5 క్వింటాళ్లు, నీటి పారకంతో సాగు చేస్తే ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
వరికి బదులు ఆరుతడి పంటలే మేలు…
వరి సాగుతో రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటల దిశగా సన్నద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో వరి పంటను 20-30 శాతానికి తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, మంచి శనగ, పెసర్లు, కంది సాగుచేస్తే ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది. నీళ్లు కూడా పుష్కలంగా ఉండడంతో అధిక దిగుబడితో పాటు మద్దతు ధరకంటే ఎక్కువ ధర మార్కెట్లో పొందే వీలుంటుంది.
ప్రత్యామ్నాయ పంటలే మేలు
వరికి బదులుగా ఆరుతడి పంటలే మేలు. వరి సాగు చేస్తే లాభాలు ఎక్కువగా ఉండట్లేదు. చాలాసార్లు నష్టాలే వస్తున్నయి. భూసారం దెబ్బతిని, తెగుళ్లు ఎక్కువైతున్నయి. అందుకే వరికి గాకుండా వేరే పంటలు వేద్దామనుకుంటున్నాం. ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. ఇప్పటికే దుక్కి దున్ని చదును చేశాను. విత్తనాలను శుద్ధి చేసుకుంటున్నాం.
పల్లీ సాగుతో 2 ఎకరాల్లో లక్షకు పైగా ఆదాయం
పెద్ద అడిశర్లపల్లి, నవంబర్ 10 : మండలంలోని మదారిగూడేనికి చెందిన రైతు రాయినబోయిన సైదులు వానకాలంలో వేరుశనగ సాగు చేసి అత్యధిక దిగుబడి సాధించాడు. రూ.30వేల పెట్టుబడితో నాలుగు నెలల పంటలోనే దాదాపు ఎకరానికి 15 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించాడు. కదిరి నుంచి లేపాక్షి రకానికి చెందిన వేరుశనగ విత్తనాలను తెప్పించి జూలై నెలలో చల్లాడు. వర్షాల కారణంగా నీటి తడులు పెట్టాల్సిన అవసరం రాలేదు. 120 రోజుల్లోనే దిగుబడి వచ్చింది. వాతావరణం అనుకూలించడంతో ఒక వేరుశనగ మొక్కకు 150కి పైగా కాయలు వచ్చాయి. పెట్టుబడి ఖర్చులు పోను లక్షకు పైగా ఆదాయం వచ్చిందని తెలిపాడు. తక్కువ పెట్టుబడితో, శ్రమ ఎక్కువ లేకుండా అత్యధిక ఆదాయం వేరుశనగ ద్వారా సాధించవచ్చని నిరూపించాడు.
వేరుశనగ లాభదాయకం
వరిసాగు కంటే ఆరు తడి పంటలు ఎంతో మేలు అనిపిస్తుంది. గతేడాది వానకాలంలో ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ వేయడం వల్ల ఎకరానికి 70 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. వరిసాగు చేస్తే ఎకరానికి 20 వేల రూపాయలే మాత్రమే మిగులుతున్నయ. వేరుశనగ పంటలో 40 వేల వరకు మిగులుతున్నయి. వేరుశనగతోపాటు మినుములు కూడా సాగు చేయాలని అనుకుంటున్నా.
ఆరుతడి పంటలతోనే లాభాలు
నేను వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నాను. రెండు ఎకరాల్లో వేరుశనగ, రెండు ఎకరాల్లో కంది, రెండు ఎకరాల్లో కూరగాయలు, ఎకరంలో సీతాఫలం, ఖర్జూర పంటలను సాగు చేస్తున్నాను. దీంతోపాటు నాటుకోళ్లు, తేనేటీగల పెంపకం చేపట్టాను. లాభాలు బాగున్నాయి. రైతులు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసి ఆదాయం పొందాలి.
4 ఎకరాల్లో కంది సాగు చేసినా..
గతేడాది 9వేల పెట్టుబడితోని ఎకరం కంది వేస్తే 60 వేలు వచ్చినయి. ఈ సారి 4 ఎకరాల్లో కంది వేశాను. రైతుబంధు డబ్బులే పెట్టుబడికి సరిపోయినయి. కంది పూత దశలో ఉన్నది. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. రెండున్నర లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం చెప్పినట్లు పంట మార్పిడి చేసిన రైతులు లాభాలు గడిస్తున్నారు. చెప్పింది వినకుండా పాత పద్ధతిలోనే పంటలు మార్చకుండా వరినే నమ్ముకుంటే ఇబ్బందులు తప్పవు.