సూర్యాపేట, నవంబర్ 6 : పోడు భూముల హక్కుల పరిరక్షణలో పాదర్శకతకు పెద్ద పీట వేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలను అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధ్యక్షతన ‘అడవుల సంరక్షణ- పోడు భూముల పరిరక్షణ’పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలను అందించడంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పోడు భూముల పరిష్కారానికి ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అఖిలపక్షాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం, మేళ్లచెర్వు, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో 570 మంది రైతులు 1545.15 ఎకరాల్లో అటబీ భూమి సాగు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో రెవెన్యూ, ఫారెస్ట్ భూముల సరిహద్దులు సరిగ్గా లేక పోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. పూర్తి స్థాయిలో సర్వే చేయించి హద్దులు నిర్ణయించనున్నట్లు తెలిపారు. ఫారెస్ట్ రైట్స్ కమిటీ చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీ, సబ్ డివిజన్ కమిటీలు ఉంటాయని చెప్పారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో అటవీ భూములకు రక్షణ ఉంటుందన్నారు. సోమవారం నుంచి గ్రామ సభలు నిర్వహించి పూర్తి స్థాయిలో చట్టంపై అవగాహన కల్పించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అటవీ సంరక్షణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం గిరిజన, గిరిజనేతరులకు హక్కు పత్రాలు అందించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ హక్కు పత్రాలు అందించడానికి పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. సమావేశంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, డీఎఫ్ఓ ముకుందారెడ్డి, డీటీడబ్యూఓ శంకర్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, కిశోర్‌కుమార్, వెంకారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, బీజేపీ నాయకులు హబీద్, సీపీఐ, సీపీఎం నాయకులు వెంకటేశ్వర్లు, రవినాయక్ పాల్గొన్నారు.