పొడిచేడులో శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులర్పించిన మంత్రి
మోత్కూరు, డిసెంబర్3 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణ త్యాగం గొప్పదని, ఆయన అమరత్వాన్ని యావత్ ప్రజలు ఎన్నడూ మరువబోరని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి 12వ వర్ధంతిని శుక్రవారం మోత్కూర్ మండలంలోని పొడిచేడు గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ నాటి ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం చావును సైతం లెక్క చేయకుండా చేపట్టిన దీక్షను ఆంధ్ర పాలకు కుట్రలు చేసి భగ్నం చేసే ప్రయత్నం చేయడంతో తట్టుకోలేక శ్రీకాంతాచారి ఆత్మాహుతికి పాల్పడ్డాడన్నారు. శ్రీకాంత్ ప్రాణ త్యాగం ప్రజలను మేల్కొల్పిందని చెప్పారు. అమరుల త్యాగాలు వృథా పోలేదని, వారి ఆశయాల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ప్రజలు పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు పాల్గొన్నారు.