మేళ్లచెర్వు, డిసెంబరు 2: కృష్ణానది తీరాన ఉండే మేళ్లచెర్వుకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. శతాబ్దాల చారిత్రక పునాది ఉన్న స్వయంభు శంభులింగేశ్వరుడు వెలసిన క్షేత్రమిది. ధాన్యపు సిరులు కురిపించే వరి మాగాణులు, తెల్ల, ఎర్ర బంగారాలను పండించే నల్ల రేగడి భూములు ఈ ఊరి సొంతం. ఎన్నో రాష్ర్టాల్లో ఆకాశాన్నంటే వేలాది భవన నిర్మాణాలకు కావాల్సిన సిమెంటును తయారు చేసి అందించిన క్షేత్రమిది. దశాబ్దాల క్రితం కుగ్రామంగా ఉన్న మేళ్లచెర్వు నేడు సకల వసతులకు సుగ్రామంగా మారింది. రేపటి రోజుల్లో ‘పుర’ హోదాను తన పరంగా చేసుకోబోతున్న మండల కేంద్రంలోని ప్రత్యేకతలు.
మెడ్ల చెర్వు కాస్త మేళ్లచెర్వుగా..
గ్రామంలో సాధారణంగా ఒకటే చెరువు ఉంటుంది. కానీ ఈ గ్రామంలో రెండు చెరువులు ఉన్నాయి. ఇవి గొలుసుకట్టు జలాశయాలు. చెరువుల చుట్టూ మేడి చెట్లు ఉండటం.. ఈ నీటి వనరులను ఆధారంగా చేసుకుని సమీపంలో ప్రజలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. మేడి చెట్లతో కూడిన చెరువుల్ని ఆధారంగా చేసుకుని ఏర్పాటైన ఈ పల్లె ఆరంభంలో మెడ్ల చెర్వుగా పిలువబడేది. రాన్రాను రూపాంతరం చెంది మేళ్లచెర్వుగా మారింది.
స్వయం‘భువనం’
దక్షిణ కాశీగా పేరొందిన స్వయంభు శంభులింగేశ్వరుడు జన్మనిచ్చిన క్షేత్రం మేళ్లచెర్వు. కాకతీయుల కాలంలో వెలసిన గంగాసమేత శివలింగం నుంచి తీసినకొద్దీ నీరు ఊరుతుండటం విశిష్టత. ఈ శైవ క్షేత్రం రాన్రాను రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. శివరాత్రి పర్వదినాన ఐదు రోజుల జాతర ఏపీలోని కోటప్పకొండ వేడుకకు తీసిపోని రీతిలో సాగుతుంది. పలు జిల్లాల నుంచి లక్షల మంది భక్తులు ఇక్కడకు వచ్చి జంగమయ్యను దర్శించి వెళ్తారు.
సున్నపు రాయి నిధి..
మేళ్లచెర్వు అనగానే గుర్తొచ్చేది సున్నపు రాయి, సిమెంటు కర్మాగారాలు. పూర్వం మండలంలో 9సిమెంటు కర్మాగారాలు ఉండేవి. ఇవన్నీ రాష్ట్రంలో పేరెన్నికగన్న సిమెంట్ కంపెనీలే. ప్రస్తుతం మండల కేంద్రంలో రెండు సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ కర్మాగారాల వల్ల వేర్వేరు రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడుతున్న వారూ ఉండటం విశేషం. మొత్తంగా భిన్న సంస్కృతుల కూడలిగా మారుతోంది.
నల్ల మాగాణి
గ్రామానికి ప్రధాన విశిష్టత ఇక్కడి భౌగోళిక వైరుధ్యమే. పరిశ్రమలకు ఉపయోగపడే రాళ్ల భూములున్నాయి. ధాన్యం పండించే ఎర్ర మాగాణులూ ఉన్నాయి. వాణిజ్య పంటలకు అనుకూల పొలాలూ ఉన్నాయి. సాగర్ కాల్వ విస్తరించి ఉన్న ఏ మండలంలోనూ ఇన్ని వైరుధ్యాలు లేవని చెప్పవచ్చు. దాదాపు 10వేల ఎకరాల్లో వరి పండిస్తుండగా, 12వేల ఎకరాల్లో పత్తి, మిరప తదితర వాణిజ్య పంటల్ని పండిస్తున్నారు. జల వనరులు పుష్కలంగా ఉండటంతో ఉపాధి అవకాశాలు తద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి.