మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు.. పొడిచెడు ముద్దు బిడ్డ శ్రీకాంతచారి. తన ఆత్మార్మణతో నాలుగు కోట్ల తెలంగాణ ఉద్యమ సారథులను ఒక్కతాటిపైకి తెచ్చి.. ప్రత్యేక రాష్ట్ర కలను సాకమయ్యేలా చేసిన త్యాగశీలి. శుక్రవారం శ్రీకాంతాచారి వర్ధంతి పొడిచెడులో నిర్వహించనున్నారు. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటాచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకాంతాచారి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు (అగస్టు15)న పుట్టిన అతను అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. చిన్న తనం నుంచి ఆటల్లో, పాటల్లో, సమాజ సేవలో అతను ముందుండేవాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన శ్రీకాంతాచారి టీఅర్ఎస్లో క్రియశీల కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఆధినేత కేసీఅర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష శ్రీకాంతాచారిలో ఉద్యమావేశాన్ని నింపింది. నాడు ఉద్యమకారులపై ప్రభుత్వ దమనకాండ, అరెస్టులను చూసి తట్టుకోలేక పోయాడు. 2009 నవంబర్ 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఉద్యమ నేత కేసీఅర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ఆందోళనలో శ్రీకాంతాచారి పాల్గొని ఉద్వేగంలో, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు. చికిత్స పొందుతూ డిసెంబర్ 3న రాత్రి 10:30 గంటలకు తుది శ్వాస విడిచాడు.
నేడు పొడిచెడులో వర్ధంతి సభ
శ్రీకాంతాచారి స్వగ్రామం మోత్కూరులో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించనునున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పాల్గొని గ్రామంలోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సంతాప సభలో పాల్గొననున్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని అతడి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ కోరారు.
బాసటగా నిలిచిన ప్రభుత్వం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం శ్రీకాంతాచారి కుటుంబానికి అండగా నిలిచింది. అమరులందరిని ఆదుకోవడంతో పాటు, అసరా కల్పించింది. 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంతాచారి సోదరుడు రవీంద్రాచారికి రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అతని కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించింది. దీంతో పాటు అతడి తల్లి శంకరమ్మకు హూజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి బరిలో నిలిపింది.