Suriya ET Teaser | సూర్య పేరుకు ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. పేరుకు తమిళ హీరో అయినా కూడా మన దగ్గర సూపర్ క్రేజ్ ఉండేది. కానీ కొన్నేళ్లుగా అది తగ్గుతూ వస్తుంది. 17 ఏండ్ల కిందట వచ్చిన గజినీ సినిమా తెలుగులో సంచలన విజయం అందుకొని దాదాపు 10 కోట్ల మార్కెట్ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా యముడు, 24 లాంటి విజయాలతో తెలుగులో సూర్యకు దాదాపు 15 కోట్ల మార్కెట్ ఏర్పడింది. అయితే కొన్నేండ్లుగా ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో పెరిగిన మార్కెట్ మొత్తం పడిపోయింది. విజయ్ కంటే ముందుగానే మార్కెట్ సంపాదించుకున్న సూర్య.. ఇప్పుడు ఆయన కంటే ఎంతో వెనుకబడిపోయాడు.
ఒకప్పుడు సూర్య సినిమా అంటే ఎగబడి తీసుకునే డిస్ట్రిబ్యూటర్లు.. ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. NGK, సింగం 3, కప్పాన్ లాంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో సూర్య మార్కెట్ భారీగా పడిపోయింది. ఓటీటీల్లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సూర్య థియేట్రికల్ మార్కెట్ పెంచలేకపోయాయి. ఇది అంత పెద్ద విజయం సాధించినా సూర్యకి కలిసొచ్చింది ఏమీ లేదు. సూర్య అప్ కమింగ్ సినిమా ‘ఎతర్కుమ్ తునింధవం’ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ విడుదలైంది. ఈటీ అంటే ‘ఎవరికీ తలవంచకు’ అని అర్థం.
యాక్షన్ సెంటిమెంట్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. కార్తీతో చినబాబు సినిమా చేసిన పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను 10 కోట్లకి ఆఫర్ చేస్తే.. అందులో సగం పెట్టి కొనడానికి కూడా బయ్యర్లు ముందుకు రావడం లేదు. చివరికి తెలుగులోనూ ఓన్ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్ కూడా తక్కువగానే జరిగింది. ఏదేమైనా ఒకప్పుడు 15 కోట్లకు పైగా పలికిన సూర్య సినిమా డబ్బింగ్ రైట్స్.. ఇప్పుడు చాలా తక్కువకు పడిపోయింది. ఈటీ సినిమా విజయం సాధిస్తే కానీ తెలుగులో మళ్లీ సూర్యకు పునర్వైభవం రాదు. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్.