హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపింది. నైరుతి ఉపసంహరణ రేఖ తూర్పు, సుపాల్, రాంచీ, రాయ్పూర్, బ్రహ్మపురి, పర్భణి, బారామతి, హర్నై, 17.5 దక్షిణ,71.8 తూర్పు దిశగా కొనసాగుతున్నదని తెలిపింది. మరాఠ్వాడా, విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. ఏపీ, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వెల్లడించింది.