కేంద్రం తేలిగ్గా తీసుకుంటున్నదని ఆవేదన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ట్రిబ్యునళ్లలోని ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అధికార యంత్రాంగం ఈ సమస్యను తేలికగా తీసుకుంటున్నదని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో భారీస్థాయిలో ఉన్న ఖాళీల భర్తీ అంశాన్ని విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ స్పందనను తప్పుబట్టింది. ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏవో అరకొర నియామకాలు జరిపి తర్వాత వదిలేశారని పేర్కొన్నది. న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, హిమా కోహ్లీ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన నియామకాల గురించి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విన్నవించారు. విచారణను ధర్మాసనం రెండువారాలు వాయిదా వేసింది.