న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకం కోసం సిఫారసు చేసే కొలీజియం అంటే సెర్చ్ కమిటీ కాదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం కొలీజియం పునరుద్ఘాటించిన అభ్యర్థుల పేర్లను, వారిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించనివారి పేర్లను వచ్చే బుధవారం నాటికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొలీజియం తన నిర్ణయాన్ని పునరుద్ఘాటించినపుడు, దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం సంప్రదాయమని తెలిపింది. కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలు ఉంటారు. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, నిర్ణీత వ్యవధిలోగా కొలీజియం సిఫారసులను ఆమోదించకపోతే, ఆ వ్యవధి తర్వాత ఆ సిఫారసుకు ఆమోదం లభించినట్లుగానే పరిగణించే నిబంధన ఉండాలన్నారు.
అడ్వకేట్ హరీశ్ విభోర్ సింఘాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జార్ఖండ్ ప్రభుత్వం దాఖలు చేసిన మరొక పిటిషన్లో తమ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావును నియమించాలని కొలీజియం సిఫారసు చేసిందని, దానిని ఆమోదించనందుకు కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని కోరింది. జార్ఖండ్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మాట్లాడుతూ, ఒరిస్సా హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ బీఆర్ సారంగిని జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం చాలా ముందుగానే సిఫారసు చేసిందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ విరమణకు 15 రోజుల ముందు మాత్రమే ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇది చాలా తప్పు అని వ్యాఖ్యానించారు.
ఆఖరి నిమిషంలో పరీక్ష పద్ధతిలో మార్పులా?
ఆఖరి నిమిషంలో నీట్-పీజీ 2024 పరీక్ష ప్యాటర్న్‌ను మార్పు చేయడానికి కారణమేమిటని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్బీఈ)ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది అసాధారణ విషయమని, దీని కారణంగా విద్యార్థులు పరీక్షలో వైఫల్యం చెందే అవకాశం ఉందని పేర్కొంది. విద్యార్థుల తరఫున న్యాయవాదులు విభా దత్త మహిజ, తన్వీ దుబే దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. దీనిపై వారంలోగా సమాధానం ఇవ్వాలని ఎన్బీఈ, కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఆగస్టు 11న జరిగిన నీట్-పీజీ పరీక్షల్లో పరీక్షా విధానం, మార్కుల నార్మలైజేషన్ తదితరమైనవి ఆఖరి నిమిషంలో మార్పులు చేశారని, దీని కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని పిటిషనర్లు ఆరోపించారు.