‘విజయ్ దేవరకొండ అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. ఎవరి అండ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగాడు. స్వశక్తితో పైకొచ్చిన విజయ్‌లాంటి వ్యక్తుల్ని నేను ఆరాధిస్తాను. విజయ్ మంచి తెలివితేటలతో పాటు గొప్ప హృదయం కలవాడు. అతను కెరీర్లో మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నా. విజయ్ సినిమాలపరంగానే కాకుండా బిజినెస్‌లో కూడా ప్రయోగాలు చేస్తున్నాడు’ అని అన్నారు అగ్రహీరో అల్లు అర్జున్. శనివారం జరిగిన ‘పుష్పక విమానం’ ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ, గీత్సైనీ, శాన్విమేఘన నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించారు. గోవర్ధన్ రావు, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. నవంబర్ 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ విజయ్ దేవరకొండ కెరీర్లో ఎదుగుతుంటే మీకు జెలసీగా అనిపించడం లేదా? అని కొంత మంది నన్ను అడిగారు. మన తర్వాత వచ్చిన వారి గురించి జెలసీగా ఫీలవుతున్నామంటే వారితో సమానంగా మనం పరిగెత్తడం లేదని భావించాలి. రేసులో దూసుకుపోయేవాళ్లను చూసి నేను స్ఫూర్తి పొందుతాను. అలాంటి పోటీని పాజిటివ్‌గా తీసుకోవాలి. ఆనంద్ దేవరకొండ కథల్ని ఎంచుకునే తీరు బాగుంది. కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు వచ్చి విభిన్నమైన స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటున్నాడు. ప్రతి మనిషికి ఓ గిప్ట్ ఉంటుంది. అదే ఒరిజినాలిటీ.
మనతో మనం పోటీపడాలి. పక్కన వాడితో కాదు’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ స్వీయ నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ది హిల్ పతాకంపై నేను నిర్మించిన రెండో చిత్రమిది. ‘పెళ్లిచూపులు’ సమయంలో కొత్తవాళ్లమైన మమ్మల్ని నిర్మాతలు ఎవరూ నమ్మలేదు. ‘అర్జున్‌రెడి’్డ సినిమా నిర్మించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తన ఆస్తులను తాకట్టు పెట్టి సొంత డబ్బులతో సందీప్‌రెడ్డి వంగా సినిమాను నిర్మించారు. ప్రతిభ ఉన్నా కొత్త వాళ్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం సులభం కాదు. ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే నిర్మాణ సంస్థను స్థాపించాను. కొత్తప్రతిభను ప్రోత్సహించడానికి అల్లు అర్జున్ ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం కథాంశాల పరంగా తెలుగు సినిమా పరిధి విస్తృతమవుతున్నది. పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో నటన, పాత్రల పరంగా హీరోలందరూ విభిన్నంగా అడుగులు వేస్తూ హద్దులను చెరిపివేస్తున్నారు. ఆ సినిమాలు నటుడిగా నాలో పోటీ తత్వాన్ని పెంచాయి. ‘పుష్ప’ పాటలు, ట్రైలర్ చూసిన తర్వాత నేను మరింత కష్టపడాలనే భావన కలిగింది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ పూర్తిగా జీవించారు. ఈ సినిమాతో అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతున్నారు. ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ’ అని తెలిపారు.