ఖైరతాబాద్, మార్చి 31: దేశంలో హిందూ ఆలయాల నిర్మాణం, సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల రక్షణలో రాజుల కాలంలో చాళుక్యులు, శ్రీకృష్ణ దేవరాయులు విశేష కృషి చేస్తే, ఆధునిక కాలంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వారి సరసన చేరారని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సంకేపల్లి సుధాకర శర్మ అన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచ అద్భుతంగా పునర్నిర్మించారని కొనియాడారు. త్వరలోనే వేములవాడ క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారని, ఈ దేవాలయం కూడా ఖండాంతర ఖ్యాతి గడిస్తుందని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2011 నుంచి తమ సంఘం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యిందని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ఏకైక ధార్మిక సంస్థ తమదేనని స్పష్టం చేశారు. పడవ అనే అర్థాన్నిచ్చే ప్లవనామ సంవత్సరంలో కరోనా అనే కష్టాన్ని దాటామని, ఇప్పుడు శుభకృత్‌నామ సంవత్సరంలోకి అడుగిడుతున్న తరుణంలో అన్ని శుభాలు కలుగాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ చల్లగా వర్ధిల్లాలని రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అనువంశిక అర్చకత్వాన్ని పునరుద్ధరించాలి
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో అనాదిగా వస్తున్న అనువంశిక అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని వేములవాడ బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపాధ్యాయుల సాంబశివుడు కోరారు. ప్రస్తుతం తెలంగాణలో 128 అనువంశిక అర్చక కుటుంబాలు వందల ఏండ్లుగా దేవాలయాలపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. వేములవాడ క్షేత్రంలో వారి అర్చకత్వ హక్కులను సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వేములవాడ బ్రాహ్మణ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మామిడిపల్లి రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వొజ్జాల సతీశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఈశ్వరిగారి రమణ, సహాయ కార్యదర్శి వొజ్జాల మనోజ్ కుమార్ శర్మ, కోశాధికారి వొజ్జాల శ్యామ్ ప్రసాద్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.