Basara IIIT | బాసర, సెప్టెంబర్ 6: బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. గత మూడు రోజులు ఆందోళన చేస్తున్న విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శుక్రవారం క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ట్రిపుల్ఐటీ ప్రధాన ద్వారం ముట్టడికి ఏబీవీపీ నాయకులు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీసీ రాజీనామా చేయాలని, రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. 17 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని యూనివర్సిటీ అధికారులకు అందజేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని, గతంలో మాదిరిగా ధర్నా చేస్తామని ట్రిపుల్ఐటీ విద్యార్థుల సంఘం (టీఎస్ఏఎస్) హెచ్చరించింది.
నాడు గోడ దూకిన రేవంత్
తమ సమస్యలను పరిష్కరించాలంటూ రెండేండ్ల క్రితం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి బాసర త్రిపుల్ ఐటీకి రాగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులను తప్పించుకొని గోడ దూకి ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి సీఎం అయినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇన్చార్జి వీసీ వెంకటరమణ స్థానికంగా ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.