హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు కోరారు. గురువారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ ఆధ్వర్యంలో హైదరాబాద్ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుందని చెప్పారు.
ప్రభుత్వ విద్యను బాగుచేస్తామని చెప్పి 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ఆలోచన చేయడం దుర్మార్గమని తెలిపారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిలాగా లేడని.. బీజేపీలాగా పాఠశాలలు మూసివేసి, జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నాడని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.