న్యూఢిల్లీ : 300కు పైగా లగ్జరీ హోటళ్లలో బస చేసి బిల్లు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్న 69 ఏండ్ల తమిళనాడు వృద్ధుడిని భువనేశ్వర్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తప్పుడు గుర్తింపు కార్డులను ఉపయోగించి అతడు ఈ మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని బింగ్సన్ జాన్‌గా గుర్తించారు. విదేశీ టూరిస్ట్ గైడ్‌గా, ఇంగ్లిష్ టీచర్‌గా లేదా యోగా శిక్షకుడిగా చెప్పుకొని పలు ఫైవ్ స్టార్ హోటళ్లలో కొన్ని రోజుల పాటు బస చేసి బిల్లులు చెల్లించకుండా నిందితుడు మాయమయ్యేవాడు. కొన్ని హోటళ్లలో విలువైన వస్తువులను కూడా దొంగిలించేవాడు. తాజాగా రాయ్‌పూర్‌లోని ఓ హోటల్లో ఇలాగే రెండు రోజులు బస చేసి ఒక ల్యాప్‌ట్యాప్ తస్కరించి పారిపోయాడు.
అతడి మొబైల్ ఫోన్ రికార్డుల ఆధారంగా పోలీసులు అతడిని భువనేశ్వర్‌లో అరెస్ట్ చేశారు. 1990 నుంచి 300కు పైగా హోటళ్లలో తాను ఈ తరహా మోసాలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. 1980 దశకంలో ఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసిన నిందితుడిని అతడి ఉద్యోగ రీత్యా పర్యాటకులతో పాటు బస చేసేందుకు హోటళ్లు అనుమతించేవి. అయితే ఒకసారి ఒక హోటల్లో ఒక విషయంలో తప్పు జరిగినప్పుడు హోటల్ సిబ్బంది జాన్‌ను అవమానించారు. దీంతో ఆ నాటి నుంచి విలాసవంతమైన హోటళ్లను నిందితుడు లక్ష్యంగా చేసుకొన్నాడు. 1996లో నిందితుడు మొదటిసారి జైలుకు వెళ్లాడు.