కాసిపేట : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ (ACP Ravikumar ) హెచ్చరించారు. శనివారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మామిడిగూడెం గ్రామంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డెన్ సెర్చ్‌ను (Cordon search ) నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహన పత్రాలు సరిగా లేని 25 వాహనాలను , మూడు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. గుడుంబా అమ్ముతున్న ఒక వ్యక్తి వద్ద రెండున్నర లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు బెల్ట్ షాపులో లిక్కర్ స్వాధీనం కేసు నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రొగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యతని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్థులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరైనా కొత్త వారు అద్దెకు వస్తే వారికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోవాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
సమస్యలుంటే డయల్ 100కు కాల్ చేయాలని , సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్‌లకు, వాట్సాప్ కాల్స్‌కు స్పందించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు, మందమర్రి ఎస్సై, ఏఎస్సైలు బూర రవీందర్, మందమర్రి సర్కిల్ పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.