రాయపోల్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలనను పాటించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ( Collector Haimavati ) ఆదేశించారు. గురువారం జిల్లాలోని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని( PHC ) ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ అరెపల్లి ప్రాంతంలో ఫీల్డ్ విజిట్‌లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా, వెంటనే వీడియో కాల్ ద్వారా నిజానిజాలు నిర్ధారించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఆసుపత్రి సమయాలను కచ్చితంగా పాటిస్తూ, రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియలో బీఎల్ఓల పని తీరును సమీక్షిస్తూ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియలో మండలంలోని గ్రామాల్లో భూ యజమానులతో చర్చలు జరిపి ఆర్బిట్రేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలన్నారు.