Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు, కట్టుకథల ప్రచారంతో చరిత్రను మార్చలేవు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ఓ వైపు కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలు పండాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని, మరోవైపు ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం, ఇవన్నీ రికార్డు స్థాయి పంట సాగుకు కారణాలు కావా? అని నిలదీశారు. ఎల్లంపల్లి-మిడ్‌మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలు అనే వాస్తవాన్ని దాచిపెట్టినా దాగదని తేల్చిచెప్పారు.
కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ, నిజాంసాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయనే వాస్తవాన్ని విస్మరించలేరని హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయం, సాగునీటిపై సీఎం రేవంత్ నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎజెండా అంశాలు తొలగించకుండా 18న జరిగే మీటింగ్‌కు హాజరైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.