హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి శివారులోని రామప్ప గుట్టపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాతిచిత్రాలను గుర్తించింది. ఇవి సామాన్య శకానికి పూర్వం పదివేల ఏండ్లకు చెందినవని, మధ్య రాతి యుగం నాటి ఆనవాళ్లు అని తెలిపింది. కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, జోయెల్ కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ చారిత్రక ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రామప్ప గుట్టపై జరిపిన పరిశోధనల్లో రాతి చిత్రాలను కనుగొన్నారు. ఇందులో రెండు పాములు, ఒక పెద్ద తాబేలు, రెండు చిన్న తాబేళ్లు, ఎక్స్ గీతలలో మానవరూపం, గడ్డి, జిగ్ జాగ్ రేఖలు రాతిపై కనిపిస్తున్నాయి. ఒకసారి వేసిన రాతి చిత్రాల మీదే మళ్లీ చిత్రాలు వేయటంతో బొమ్మల్లో స్పష్టత కొరవడింది. వర్ష ధారల కారణంగా చాలా చిత్రాలపై రంగు వెలిసిపోయింది. గతంలో జిల్లాలోని కోనరావుపేట మండలం వట్టిమల్లగుట్టలోని గుహలో పెద్దపులితోపాటు మరికొన్ని రాతి చిత్రాలను ఈ బృందం గుర్తించింది. 1934లో లియోనార్డ్మన్, మహదేవన్ తదితరులు మహబూబునగర్ జిల్లా సంగనోనిపల్లిలో తొలిసారి రాతి చిత్రాలను గుర్తించారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు. గత 85 ఏండ్లలో తెలంగాణ వారసత్వ శాఖ 18 రాతిచిత్రాల తావులు, ఇతరులు 16 గుర్తించగా, కొత్త తెలంగాణ చరిత్రబృందం 36కుపైగా రాతిచిత్రాల తావులను కనుగొన్నదని వెల్లడించారు.