హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : చట్టం అందరికీ సమానమనేది మాటలకే పరిమితమని, రాజకీయ పలుకుబడి, పరపతి, డబ్బు ఉంటే శిక్షలు పడకుండా కేసులు తారుమారు చేయవచ్చనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే రకమైన నేరాలకు ఒకే రకమైన సెక్షన్లు, అరెస్ట్‌ల ప్రక్రియ ఉండాల్సింది పోయి అధికార పార్టీ బలం ఉన్న బడాబాబులకు ఒకలా.. సామాన్యులకు మరోలా అమలవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. మద్యం మత్తులో ప్రమాదం చేసి ఇద్దరి మరణానికి కారణమైన ఓ అధికార పార్టీ నేతపై స్టేషన్ బెయిల్ సెక్షన్, ఇలాంటి ఘటనలోనే సాధారణ పౌరుడికి బెయిల్ రాకుండా జైలుకు పంపే సెక్షన్ నమోదు చేసిన మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు నేరాలు చేస్తే పైనుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గి క్షేత్ర స్థాయిలో పోలీసులు చట్టాలు అతిక్రమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటికి ఊతమిచ్చేలా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర, కుషాయిగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాద ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
డిసెంబర్ 18న రాత్రి 9.25 గంటల సమయంలో ఓ వ్యక్తి కీసర నుంచి బండ్లగూడ వైపు టీఎస్ 08 ఎఫ్ఎల్ 4455 నంబర్ కారును అతివేగంగా నడుపుతూ వచ్చి స్కూటీపై వెళ్తున్న బొమ్మలరామారం మండలం చీకటిమామిటి గ్రామానికి చెందిన పసుపుల కృష్ణ(40), ఆయన వదిన కూతురు జ్యోత్స్న(16)ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనతో కృష్ణ కుటుంబం రోడ్డున పడింది. తన వదిన కుటుంబానికి ఆసరాగా ఉంటుందనుకున్న జ్యోత్స్న మృతితో ఆ కుటుంబానికి తీరని నష్టం దుఃఖం మిగిలింది. ప్రమాదానికి కారకుడైన రామిడి వినయ్‌రెడ్డిపై కృష్ణ భార్య కీసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాగా స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్నది. అతడిని కాపాడేందుకు స్థానిక నాయకులు తమ బాస్‌లతో పోలీసులకు ఫోన్లు చేయించారు. పోలీసులు వినయ్‌రెడ్డికి మద్యం పరీక్ష కూడా చేయించలేదన్న ఆరోపణలున్నాయి. కేసులో రాజీ కుదిర్చేందుకు రాజకీయ నాయకులు రంగంలోకి దిగి బాధితులతో మాట్లాడి కొంత నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇద్దరి మరణానికి కారణమైన వినయ్‌రెడ్డికి మద్యం పరీక్షలు చేయించి, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాల్సి ఉన్నా పోలీసులు అలాంటి చర్యలేవీ తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఈ ఘటనలో నిందితుడిపై కీసర పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 106 (1) కింద కేసు (క్రైమ్ నంబర్: 951/2025) నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదం జరిగి వ్యక్తి మృతిచెందినట్టు చెప్తుంది. ఇందులో గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష, జరిమానా పడే అవకాశాలున్నాయి. ఘటన జరిగిన రోజు పోలీసులు అక్కడికి చేరుకొని కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని, అప్పటికీ అతడు మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు. కానీ పోలీసులు అతడికి మద్యం పరీక్ష చేయించలేదనే ఆరోపణలున్నాయి. నష్ట పరిహారం పేరిట బాధితులను మభ్యపెట్టి తక్కువ తీవ్రత ఉండే సెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదు చేయించినట్టు తెలుస్తున్నది. నిందితుడు కాంగ్రెస్ మండలాధ్యక్షుడైన విజయ్‌రెడ్డికి సోదరుడు కావడం వల్లే రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గి వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వివరణ కోసం కీసర ఇన్స్పెక్టర్ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 26న అర్ధరాత్రి సమయంలో ఆవుల వెంకట్‌రెడ్డి, ఆయన భార్య ప్రమీలారాణి బై క్‌పై వెళ్తూ శారద బస్‌స్టాప్ జంక్షన్ సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా టీజీ08జే 0441 నంబర్ కారు ఢీకొట్టింది. తీవ్రంగా గా యపడ్డ దంపతులను స్థానిక దవాఖానకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. బాధితుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై మొదట ర్యాష్ డ్రైవింగ్ అండ్ నెగ్లిజెన్సీ కింద బీఎన్ఎస్ సెక్షన్ 125(ఏ) కింద (క్రైమ్ నంబర్ 154/2026) కేసు నమోదు చేశారు. బైక్ వెనుక కూర్చున్న వెంకట్‌రెడ్డి భార్య తల కు చికిత్స పొందుతూ చనిపోయింది. మృతికి కారణమైన కారు డ్రైవర్‌పై పోలీసులు అదనంగా బీఎన్ఎస్ సెక్షన్ 105ను జోడించారు. బీఎన్ఎస్ సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) హత్య కాదు, కానీ ఆ ఘటన జరిగితే అవతలి వ్యక్తి మరణిస్తాడని నిందితుడికి అవగాహన ఉండి కూడా చర్యకు పాల్పడినాడని చెప్తున్నది. ఈ సెక్షన్ కింద నిందితుడికి పదేండ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వీలుండదు. తప్పని సరిగా కోర్టులో హాజరు పరుస్తారు. తద్వారా నిందితుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులుంటాయి.