హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆధునిక సాంకేతికత వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ పోలీసులు.. నేరాల నిరూపణలో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని మరింత పటిష్ఠపరుచుకోవడంపై దృష్టి సారించారు. ప్రపంచంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్న మిషనరీని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీఎస్ ఎఫ్ఎస్ఎల్)లో ఏర్పాటు చేయబోతున్నారు.
ఇందుకోసం నాంపల్లిలోని టీఎస్ ఎఫ్ఎస్ఎల్ ప్రాంగణంలోనే మరో మూడంతస్థుల భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణంతోపాటు అత్యాధునిక మిషనరీ కొనుగోలు, ఇతర అవసరాల కోసం సేఫ్‌సిటీ ప్రాజెక్టు నిధుల నుంచి రూ.17 కోట్లు మంజూరైనట్టు టీఎస్ ఎఫ్ఎస్ఎల్ డైరెరక్టర్ అభిలాష్ బిస్త్ వెల్లడించారు. 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ భవనం ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుందని ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన అమెరికన్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)లో వాడుతున్న అత్యాధునిక ఎన్జీఎస్ (నెక్స్ జనరేషన్ జీన్స్ సీక్వెన్సర్) మిషన్‌తోపాటు ఫోరెన్సిక్ టెస్టింగ్ కో సం రూ.5 కోట్లతో స్మార్ట్ మిషన్లను అమర్చనున్నట్టు అభిలాష్ బిస్త్ తెలిపారు. ఈ మిషనరీతో శాంపిళ్లను చా లా తక్కువ సమయంలోనే పరీక్షించవచ్చని, ఫలితాలు కూడా 99% వరకు కచ్చితత్వంతో వస్తాయని చెప్పారు.
ప్రస్తుతం చాలా కేసుల్లో డిజిటల్ సాక్ష్యాధారాలు కీలకంగా మారుతున్నందున కంప్యూటర్ ఫోరెన్సిక్ విభాగం బలోపేతానికి అమెరికా, యూరప్ దేశాల నుంచి ఆ ధునిక సాంకేతికతను సమకూర్చుకోనున్నట్టు చెప్పారు. ఇందుకు పోలీస్ మోడ్రనైజేషన్ నిధుల నుంచి మరో రూ.2 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ కేసులతోపాటు సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసులకు సంబంధించిన శాంపిళ్లు కూడా టీఎస్ ఎఫ్ఎస్ఎల్కు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ల్యాబ్ ఆధునీకరణ, సిబ్బంది పెంపుతో టీఎస్ ఎఫ్ఎస్ఎల్ సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.