హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 31 : జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాల బాలికల 1,500 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ క్రీడలను ప్రారంభించారు. జనవరి 2 వరకు జరగనున్న ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి రెండు వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తొలి రోజు రన్నింగ్, జావెలిన్‌త్రో, లాంగ్‌జంప్, రెజ్లింగ్ పోటీలు నిర్వహించినట్లు జిల్లా యువజన, క్రీడా శాఖాధికారి అశోక్‌కుమార్ నాయక్ తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్‌రావు, లక్ష్మారెడ్డి, స్థానిక నాయకులు, క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.