– త్వరలో కార్మిక సంఘాల ఎన్నికలు
– ఆర్ఎం భవానీప్రసాద్
హనుమకొండ చౌరస్తా, జూన్ 13 : ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అందరీ చిరకాల స్వప్నం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్ఎం భవానీప్రసాద్ అన్నారు. శనివారం హనుమకొండలోని ఆర్ఎం ఆఫీస్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏప్రిల్ సమ్మె సమయంలో ముఖ్యమైన మూడు అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించిందని, ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం ఈ ప్రక్రియను క్యాబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తెచ్చి విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోందని, ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై, విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని తెలిపారు.
అదేవిధంగా సమ్మెకాలంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందన్నారు. విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడి స్వరం వినిపించాలనేది క్యాబినెట్ సబ్ కమిటీ, యాజమాన్యం ఉద్దేశ్యమని, త్వరలో రాష్ర్టంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామని, వారి నుంచి వచ్చే విలువైన సూచనలు, సలహాలను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపి అందరికీ ఆమోదయోగ్యంగా, నూటికి నూరు శాతం పారదర్శకంగా విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఎప్పటిలాగే విధులను అంకితభావంతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆర్ఎం భవానీప్రసాద్ కోరారు.