Vadde Naveen | సీనియర్ హీరో వడ్డే నవీన్ దాదాపు పదేళ్ల విరామం తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. దర్శకుడు కమల్ తేజ్ నార్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశీ సింగ్ కథానాయికగా నటించారు. వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై స్వయంగా వడ్డే నవీన్ నిర్మించిన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు.ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వడ్డే నవీన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
వినాయక్ మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా మారకముందు వడ్డే నవీన్ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేశానని తెలిపారు. కో-డైరెక్టర్‌గా చేసిన చివరి సినిమా కూడా నవీన్‌దేనని గుర్తుచేశారు. అదే సమయంలో తన జీవితాన్ని మార్చిన ‘ఆది’ సినిమా అవకాశం వచ్చిందని వెల్లడించారు. నవీన్ గారి సినిమా కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సమయంలోనే నాకు జూనియర్ ఎన్టీఆర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ ప్రయాణమే ‘ఆది’ సినిమాకు నాంది పలికింది. అందుకే నా కెరీర్లో నవీన్ గారికి ప్రత్యేక స్థానం ఉంటుంది” అని వినాయక్ పేర్కొన్నారు. అలాగే నవీన్ తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. నేను రాసిన ఒక సీన్ చూసి నన్ను భోజనానికి పిలిచారు. ఒకరోజు పెద్ద దర్శకుడవుతావని ఆశీర్వదించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాకుండా దర్శకుడిగా ప్రయత్నించమని ప్రోత్సహించారు. ఏ సహాయం కావాలన్నా తమ కార్యాలయానికి రావాలని చెప్పేవారు. ఎందుకో నాకు ప్రత్యేకమైన ప్రేమ చూపించేవారు అని వినాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌లో షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో విమానంలో ఓ ప్రయాణికుడు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పారు. చెన్నై విమానాశ్రయంలో పోలీసులు ఏకే-47 ఆయుధాలతో వచ్చి ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు నవీన్ గారు ఒక్క ఫోన్ కాల్ మాట్లాడగానే అతడిని విడుదల చేశారు. ఆయన ప్రభావం చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతటి పలుకుబడి ఉన్న వ్యక్తి ఆయన. అయితే ఆయన ప్రతిభకు తగ్గ స్థాయిలో కెరీర్‌ను కొనసాగించలేకపోయారని నేను భావిస్తాను అని వినాయక్ వ్యాఖ్యానించారు. ఇకపై నవీన్ తనకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకుని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని, ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.