చెన్నై: తాను మాట్లాడేటప్పుడు నిల్చోవాలని (Stand when I’m talking) మహిళా అధికారిణిని స్థానిక ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై ఆ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. మెట్టుపాళయం ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఏకే సెల్వరాజ్ మంగళవారం తన మద్దతుదారులతో కలిసి కోయంబత్తూరులోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. తన నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు గురించి అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ ఆముదా, సిబ్బందిని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా సహనం కోల్పోయారు. ‘ ముందు లేచి నిలబడండి. నేను ఎమ్మెల్యేను. ఈ గదిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎందుకు ఉన్నారు? అమర్యాదగా ప్రవర్తించవద్దు. వారిని వార్డు కౌన్సిలర్లు ఎంపిక చేసి ఉండవచ్చు. కానీ మెట్టుపాళయం మొత్తం నాకు ఓటు వేసింది’ అని ఆ ఎమ్మెల్యే అన్నారు.
కాగా, చైర్మన్ మెహరీబా దీనిపై జోక్యం చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ ఆముదాను ఆమె సీట్లో కూర్చోబెట్టింది. ‘ఆయన (ఎమ్మెల్యే) అడిగితే నిల్చోవాల్సిన పనిలేదు. మీరు కమిషనర్. కూర్చోండి’ అని ఆమెతో అన్నది. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ అధికారిణి పట్ల ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఏకే సెల్వరాజ్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఆముదా కూడా ఆ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.