ఆర్మూర్ టౌన్, జూలై 31: మెనూ ప్రకారం భోజనం అందించడంలేదని, తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నాయకుడు నరేందర్ మాట్లాడుతూ.. ఎస్టీ వసతిగృహంలో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
హాస్టల్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెనూ ప్రకారం భో జనం అందించాలని వార్డెన్ గోదావరిని విద్యార్థులు అడిగితే ఆమె దూషిస్తున్నదని, హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని హు కుం జారీ చేశారని ఆరోపించారు. వెంటనే సదరు వార్డెన్ తొలగించాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ నాయకులు నిఖిల్, రాజు, రాజేశ్, మంగ్లీ బాలాజీ పాల్గొన్నారు.