శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా 2,71,730 క్యూసెక్కులు, విద్యుత్ ద్వారా మరో 26,376 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. సుంకేశుల నుంచి 96,672 క్యూసెక్కులు జలాశయానికి వచ్చి చేరుతున్నది. సాయంత్రం 6 గంటల వరకు 4,16,384 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌కు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తు వరకు ఎత్తి 3,77,160 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 61,024 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల అవుతున్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు 884.50 అడుగులున్నది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఏంసీలకు 212.91 టీఏంసీలుగా నమోదైంది.