హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచీ డ్రామాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏండ్లు అవుతున్నా బీసీలకు తగిన న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సరైనా ప్రాతినిధ్యం దక్కలేదని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. ఓట్ల కోసం హామీలివ్వడం.. గద్దెనెక్కిన తర్వాత మరచిపోవడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన లోపభూయిష్టంగా ఉన్నదని విమర్శించారు. రాజ్యాంగంలోని మౌలిక అంశాలను విస్మరించడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఉండాలని పార్లమెంట్ ఎన్నికల ముందు పదేపదే చెప్పిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇప్పుడు నోరెందుకు మెదపడంలేదని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం జనగణనలో బీసీ గణనను చేర్చకపోవడంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు విస్మరిస్తున్నదని విమర్శించారు. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, లడక్, ఉత్తరాఖండ్‌లో జనగణన వచ్చే నెల ప్రారంభమవుతుందని, కానీ ఇప్పటివరకు బీసీల గణనపై స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ సైతం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.
బలహీనవర్గాల అభ్యున్నతిపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలకు చారిత్రక ద్రోహం చేసినట్టు భావి స్తామని స్పష్టంచేశారు. త్వరలోనే దేశంలోని అన్ని పార్టీలతో చర్చించి బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పీ విల్సన్, ప్రొఫెసర్ సూరజ్ మండల్, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరమ్ కన్వీనర్ చిరంజీవులు, ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్, అనిల్ జైహింద్, ప్రొఫెసర్ రతన్ లాల్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బాలగోని బాలరాజుగౌడ్, తదితరులున్నారు.